“సూపర్ సిక్స్” పాలన: హామీల అమలులో దూసుకుపోతున్న కూటమి సర్కార్

Spread the love

ఎన్నో ఆశలు, అంచనాలతో  రాజధాని కూడా సరిగా వేళ్లూనుకొని సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఏవిధంగా ఉపిరిపోస్తారోనని కోట్లాది ఎదురుచూపులకు తెరదించుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ వంటి హామీలతో పాటు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా అన్ని రంగాల్లో ప్రభుత్వం తన మార్కును చూపిస్తూ ప్రతి ఆంధ్రుడికి భరోసానిస్తోంది. 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో భారీ స్థాయిలో ప్రజామోదం పొంది అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల ‘కూటమి ప్రభుత్వం’ తాము ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలును కొనసాగిస్తూ ప్రజలకు చేరువైంది. రాష్ట్ర  ఆర్థిక స్థితిగతులను సర్దుబాటు చేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఈ పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన అతి ముఖ్యమైన హామీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పెంపు. గతంలో ఉన్న రూ.3,000 పెన్షన్‌ను ఏకంగా రూ.4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీనే పెంచిన పెన్షన్‌తో పాటు, ఏప్రిల్ నుండి ఇవ్వాల్సిన మూడు నెలల బకాయిలను కలిపి మొత్తం రూ.7,000 లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. ఇప్పటికీ ప్రతి నెలా క్రమం తప్పకుండా 1వ తేదీనే సాక్ష్యాత్తూ సీఎం సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మిగిలిన ప్రజా ప్రతినిధులను భాగం చేస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 

ఇక మహిళా కోసం ప్రకటించిన  దీపం 2.0 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం) ను ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రారంభించింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకం ద్వారా కోట్లాది మంది గృహిణులకు ఆర్థికంగా లబ్ది చేకూరనుంది.  అర్హులైన ప్రతి కుటుంబానికి నిర్ణీత టైమ్ లో  సిలిండర్లను బుక్ చేసుకునే వీలు కల్పించి, నగదును డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్స్ లోకి జమ చేసే (DBT) విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించింది.  అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తోంది.  5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని… ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారుచేసే కార్యక్రమంలో నిమగ్నమైంది. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ…. కేంద్రంతో కలిసి మహిళల్లో  సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టింది.  మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను తీసుకొస్తోంది. మహిళా సాధికారత విషయంలో అన్ని రంగాల్లో మరిన్ని విజయాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది.

అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రకటించిన యువగళం నిరుద్యోగ భృతి మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది.  కేవలం భృతి ఇవ్వడమే కాకుండా, యువతకు ఉపాధి కల్పించేలా ఇండస్ట్రీలతో   ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ సహా పలు కీలక గ్లోబల్ కంపెనీలు ఏపీలో తమ సంస్థల కార్యకలాపాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి.  దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. 

రైతు సంక్షేమం కోసం ప్రకటించిన అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.  కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చేర్చి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.  విత్తనాలు, ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వ్యవసాయానికి, రైతులకు ఎటువంటి సంక్షోభం లేకుండా  లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. మొత్తంగా చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను అమలు చేస్తూ పాలనలో తన ముద్ర వేస్తోంది. 

అలాగే తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను హామీగా కాకుండా బాధ్యతగా తీసుకున్న కూటమి సర్కార్ చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపే  ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగవనుంది. చేనేత వస్త్రాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా బ్రాండ్ కల్పిస్తూ అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈవిధంగా కూడా తోడ్పడు అందిస్తోంది. 

మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదనే ఆలోచనతో  ప్రభుత్వాన్ని ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ దాతృత్వం కలిగిన ధనిక వర్గాలు అట్టడుగు వర్గాల వారిని ఆదుకునే విధంగా  P4 అనే  కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. P4 అంటే Public-Private-People Partnership. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు తెచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్రకటించింది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది.  అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని భరోసానిచ్చింది. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుందని నిరుద్యోగ యువతకు హామీనిస్తూ ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇప్పటికే ఇటు ప్రైవేట్ కంపెనీల రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనా మరియు అటు ప్రభుత్వ కొలువులు సాధించాలన్న యువత ఆకాంక్షకు ఈ జాబ్ క్యాలెండర్ తో కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇక ఎంతో కాలంగా సందిగ్ధంగా ఉన్న రాజధాని సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే తీర్మానాన్ని చేసి పార్లమెంటుకు పంపించగా…కూటమి ప్రభుత్వ కృషితో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం పొందటం రాష్ట్ర ప్రజలందరికీ రాజధాని ఇదే అని స్పష్టతనివ్వడంతో పాటు భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సగటు ఆంధ్రుడు మా రాజధాని అని చెప్పుకునే విధంగా పకడ్బందీగా రాజధాని అమరావతి చిక్కులు తొలగించి ప్రజలలో భరోసా కలిగించింది. మొత్తానికి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేయడం యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం మరియు పరిశ్రమల స్థాపనకు అనువైన విధానాలను తీసుకురావడం అలాగే మరోవైపు, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల  మరమ్మతులు, అమరావతి రాజధాని పనుల వేగం,పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *