నేతన్నలకు అండగా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం 

Spread the love

ఆంధ్రప్రదేశ్‌ లో నేతన్నలకు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఏప్రిల్ 1 నుండి  చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌కు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించనుంది.  ఎలక్ట్రిక్ పవర్ బిల్లుల భారాన్ని తగ్గించి, చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 మాగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి రూ.8,640, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి రూ.21,600 వరకు లబ్ది చేకూరనుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక తప్పనిసరి ఖర్చుగా మారిన సందర్భంలో మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతన్నలకు దన్నుగా నిలవనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచింది. రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది. ముడి సరుకులపై 15 రాయితీ, నాణ్యమైన నూలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయం కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో నేరుగా వినియోగదారులు అమ్మకాలు జరిపే అవకాశం కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *