ఇది అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్..రక్షణ సీమగా రాయలసీమ

Spread the love

భారతదేశ ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్ట్ AMCA (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్). DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) మరియు ADA (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) ల ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతున్న ఈ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ మన  ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో నిర్మిస్తుండడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని చెప్పక తప్పదు. అసలు మొదట తమిళనాడులోని హోసూర్ లో ఏర్పాటవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు ఎలా వచ్చింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకురావడానికి ఎలా కృషి చేసింది? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాకతో పుట్టపర్తి రక్షణా రంగ హబ్ గా పుట్టపర్తి ఎలా మారబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం…

ఏపీ సీఎం చంద్రబాబు  రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనే సరికొత్త నినాదంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.  గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత అడ్వాన్స్డ్ రేంజ్ కు తీసుకెళ్తూ, కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎంత వేగంగా ఇస్తున్నామనే దానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టేట్ డెవలప్మెంట్ ఫస్ట్ నినాదంతో ఇన్వెస్టర్లకు  “రెడ్ కార్పెట్” వెల్కమ్ చెబుతూ నిర్ణీత సమయాల్లో ప్రాజెక్టులకు ఆమోదం లభించేలా పరిపాలనా యంత్రాంగాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక రక్షణా ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురాగలిగారు. మొదట తమిళనాడులోని హొసూరులో ఈ ప్రాజెక్టు రావాల్సిఉంది. అయితే ఏపీ ప్రభుత్వం చూపిన చొరవతో అది ఇక్కడికే రాగలిగింది. 

మొదట బెంగళూరుకు దగ్గర్లో ఉన్న తమిళనాడులోని హోసూర్ కు వస్తుందని ధీమాగా ఉన్న సమయంలో చంద్రబాబు విశేష కృషితో రాష్ట్రానికి వచ్చే విధంగా చక్రం తిప్పారు. ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ గేమ్ ఛేంజర్ లా పనిచేసింది. కేవలం 21 రోజుల్లోనే అన్ని అనుమతులను జెట్ స్పీడ్ తో పూర్తి చేసి బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు కేవలం 130 కిమీ దూరంలో ఉన్న పుట్టపర్తిని వ్యూహాత్మకంగా ప్రెజెంట్ చేసి ఏపీలో ఏర్పాటయ్యేలా చేసింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటున్నాయి. రక్షణా రంగ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ను అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్ గా అభివర్ణించారంటే ఏపీ ఏ రేంజ్ లో పెట్టుబడుల కల్పనకు చర్యలు తీసుకుంటోందో అర్ధం చేసుకోవడానికి ఇదొక తార్కాణం. 

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ ను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్‌ గా మార్చే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు దూసుకుపోతోంది. ఈ చొరవ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఉత్సాహం చూపిస్తుండటమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సింగిల్ విండో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసి, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే, కొన్ని సందర్భాల్లో కొన్ని గంటల్లోనే అవసరమైన అన్ని అనుమతులు  వచ్చేలా టైమ్-బౌండ్ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, ఇతర ముఖ్య  వసతులను వేగంగా సమకూర్చడంతో పాటు, ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శకమైన విధానాలను చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తోంది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ AMCA అత్యాధునిక యుద్ధ విమానం ప్రత్యేకత అబ్బురపరుస్తోంది.  శత్రువుల కళ్లుగప్పి వారి రాడార్లకు చిక్కకుండా ఎటాక్ చేయగలగడమే ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ యొక్క ప్రధాన ప్రత్యేకత. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని అగ్రరాజ్యాల వద్ద మాత్రమే ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశం ఈ విమానాలను స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తయారీ కేంద్రంగా మన రాష్ట్రంలోని పుట్టపర్తి ఎంపిక కావడం వలన భవిష్యత్ లో మరిన్ని కీలక ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి. 

పుట్టపర్తి రక్షణ రంగానికి వేదిక కావడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. దేశ ఏరోస్పేస్ రాజధానిగా పిలిచే బెంగళూరుకు ఇది దగ్గర్లోనే ఉంది. ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ కూడా ఉండడం కనెక్టివిటీ పరంగా కీలకంగా మారనుంది. జాతీయ రహదారుల అనుసంధానం ఉండటం వల్ల విమాన భాగాల రవాణా సులభంగా చేసుకోవచ్చు.  ఇక ఈ ప్రాంతంలో వేలాది ఉద్యోగాల కల్పన ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అపార అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు రానున్నాయి. హోటళ్లు మరియు ట్రాన్స్పోర్ట్స్  వంటి రంగాల్లో భారీగా  ఉపాధి దొరుకుతుంది. కేవలం ఒక విమానం తయారీకే పరిమితం కాకుండా ఇది ఒక భారీ పారిశ్రామిక కారిడార్‌గా మారుతుంది. డ్రోన్ టెక్నాలజీ మరియు క్షిపణి భాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ముందు ముందు వచ్చే అవకాశాలున్నాయి. 

పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం ప్రస్తుతం అత్యంత వేగంగా పని చేస్తోంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎటువంటి ఆలస్యానికి తావు  లేకుండా కంపెనీలకు క్లియరెన్స్ ఇస్తున్నారు. ప్రపంచస్థాయి కంపెనీలతో చర్చలు మాత్రమే చేసి వదిలేయకుండా అవి క్షేత్రస్థాయిలో భారీ పెట్టుబడులుగా మారే వరకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానాల వల్ల పెట్టుబడిదారుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి అడుగులు వేస్తోంది. అటువంటి ప్రయత్నాల్లో భాగంగా వస్తున్నవే ఇటువంటి కీలక ప్రాజెక్టులు. ఇప్పుడు మన పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక 5వ తరం ‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్టును చేపట్టడం భారతదేశ రక్షణ మరియు విమానయాన రంగాల భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్ కాబోతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా కొన్ని దేశాలకే పరిమితమైన అత్యంత అధునాతన ‘స్టెల్త్’ టెక్నాలజీతో కూడిన యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా పుట్టపర్తి అవతరించబోతోంది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే దేశ లక్ష్యానికి ఈ కేంద్రం ఒక ప్రధాన భూమిక పోషించనుంది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ లేదా పరిశోధనా కేంద్రంగానే కాకుండా, దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు, భవిష్యత్ విమానయాన ఆవిష్కరణలకు మన పుట్టపర్తి సరికొత్త  వ్యూహాత్మక కేంద్రంగా నిలవనుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సాధనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అపారమైన ఖ్యాతి, గుర్తింపు లభించడమే కాక  అంతర్జాతీయ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో రాష్ట్రం పేరు కూడా ప్రముఖంగా వినిపించనుంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడటంతో రాయలసీమ ప్రాంతం ఒక భారీ పారిశ్రామిక కారిడార్‌గా డెవలప్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  శాస్త్ర సాంకేతిక మరియు పరిశోధనా రంగాలలో యువతకు నైపుణ్యం,ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒకప్పుడు ఆధ్యాత్మికతకు కేంద్రంగా విలసిల్లిన పుట్టపర్తి ఇప్పుడు సరికొత్త సాంకేతిక యవనికపై కీలక రక్షణ రంగ ఉత్పత్తులకు హబ్ గా నిలవనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *