
కేసులంటే భయం లేదన్నారు.. జైలంటే లెక్కలేదన్నారు. దేనికైనా రెడీ అన్నారు. మీసాలు తిప్పారు… తొడలు కొట్టారు… పోలీసులకే సవాళ్లు విసిరారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. పోలీసులకు దొరకడం లేదు. ముందస్తు బెయిల్స్ ఆప్షన్లు అన్నీ అయిపోయాయి. సుప్రీం కోర్టు కూడా ముందస్తు బెయిల్ కు నో చెప్పింది. మరిప్పుడు కాకాణి ఏం చేయబోతున్నారు? పోలీసుల ముందు లొంగిపోతారా? అజ్ఞాతం వీడుతారా? అసలు ఎక్కడున్నారు?
సింహపురి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయ్. ఒకప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు అడ్రస్ కూడా కనిపించడం లేదు. అంతలా సీన్లు మారిపోయాయి. విషయం ఏంటంటే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నెల్లూరువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎక్కడున్నారో కూడా తెలియదు. క్వార్ట్జ్ అక్రమాల కేసులో తాజాగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
క్వార్ట్జ్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో A4గా కాకాణి ఉన్నారు. పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత రెండు నెలలుగా పోలీసులకు దొరక్కుండా కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవలే హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది. తాజాగా సుప్రీంలో పిటిషన్ విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు బతిమిలాడినా ధర్మాసనం ఒప్పుకోలేదు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతం వీడడం లేదు. ముందస్తు బెయిల్ కోసం అన్ని ఆప్షన్లు కంప్లీట్ అయ్యాయి. ఆయన కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దేశం దాటి వెళ్లకుండా లుక్ ఔట్ నోటిసులు కూడా జారీ చేశారు. ఇన్ని చేసినా 2 నెలలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. టెర్రరిస్టులే దొరికిపోతున్న ఈ రోజుల్లో కాకాణి మాత్రం చిక్కడం లేదని సోమిరెడ్డి అంటున్నారు. అంతే కాదు.. ఆచూకీ తెలిపిన వారికి నెల్లూరులో కాకాణి ఇంటి పక్కనే ఉండే కరోనా హౌస్ ను బహుమతిగా ఇస్తానని సోమిరెడ్డి స్వయంగా ఆఫర్ చేసినా వర్కవుట్ కావడం లేదు.
అసలు ముందస్తు బెయిల్ వచ్చాకే కాకాణి నెల్లూరుకు వస్తారా.. అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో 10 మందిపై కేసులు నమోదు చేయగా అందులో కాకాణి A4గా ఉన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి కాకాణికి కష్టాలు షురువయ్యాయి. హైకోర్టులో ఇటీవలే ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ విచారణను జూన్ 16కు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు కాకాణి అజ్ఞాతం పోలీసులకు సవాలుగా మారింది. పోలీసులలోనే కొందరు స్వామి భక్తి చాటుకుంటున్నారా అన్న డౌట్లు కూడా కూటమి నేతల్లో పెరుగుతోంది. ప్రస్తుతం కాకాణి స్ధావరం శ్రీలంకలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ఆయన అజ్ఞాతం వీడి బయటకు వస్తారా? పోలీస్ విచారణ ఎదుర్కొంటారా అన్నది కీలకంగా మారింది.
ఎలాంటి అరెస్టులకు, కేసులకు భయపడేది లేదన్న కాకాణి… ప్రస్తుతం పోలీసుల విచారణ నుంచి తప్పించుకొని తిరగడమేంటన్న చర్చ లోకల్ గా జరుగుతోంది. ఇంత మాట్లాడిన వ్యక్తి ఇలాగేనా అజ్ఞాతంలో ఉండేదన్న పాయింట్ ను వినిపిస్తున్నారు. మరోవైపు కాకాణిపై టీడీపీ నేత, ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాకాణి చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని, ఎంత తప్పించుకున్నా జైలుకు వెళ్లక తప్పదంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా భూదోపిడీకి పాల్పడ్డారని, తనపై 17 అక్రమ కేసులు పెట్టించారన్నారు. కాకాణి డబ్బు కోసం గడ్డి తినడంతోనే పాపాలు వెంటాడుతున్నాయన్నారు. అంతేకాదు.. కాకాణి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు ఇచ్చేందుకూ సిద్ధమంటున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో 250 కోట్ల మేర క్వార్ట్జ్ అక్రమంగా తరలించారని నిర్ధారించారు. మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ ఫిర్యాదుతో ఫిబ్రవరి 2న పొదలకూరు పీఎస్ లో కేసు నమోదైంది. కాకాణి చెబితేనే తాము చేశామని A1, A2, A3 నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఆయన మెడకు ఈ వ్యవహారం మరింత గట్టిగా బిగుసుకుంది. ఏప్రిల్ 10న దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటిసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి చోట్ల పోలీసులు కాకాణి కోసం ముమ్మరంగా గాలించారు.
కాకాణిపై కేవలం అక్రమ మైనింగ్ కేసే కాకుండా వెంకటాచలం పోలీస్ స్టేషన్, కావలి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డికి విదేశాలలో వేల కోట్లు ఆస్తులున్నాయని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసు కూడా కాకాణిపై ఉంది. సో మరి పోలీసులు కాకాణి అజ్ఞాతవాసానికి చెక్ పెడుతారా లేదా అన్నది చూడాలి.
కాకాణి శ్రీలంకలో ఉన్నారని ప్రచారం