కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కావూరి మృతికి తమ సంతాపం తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు గారి మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
ఏపీ మంత్రి నారా లోకేష్:
కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి గారి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.