గవర్నర్ పదవుల భర్తీపై రాజకీయ ఉత్కంఠ..టీడీపీకి మరో ఛాన్స్?

Spread the love

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులు త్వరలో ఖాళీ కాబోతుండటంతో కేంద్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేయనున్న గవర్నర్ల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా కొత్త గవర్నర్లను ఎంపిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం బలంగా ఉంది. ముఖ్యంగా ఏపీలోని టీడీపీకి మరో గవర్నర్ పోస్ట్ కేటాయించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవిని కేటాయించింది. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన పూసపాటి అశోక్ గజపతిరాజును ఆ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి అదనపు గవర్నర్ పదవి దక్కనుందనే సమాచారం క్యాడర్‌లో కొత్త జోష్ నింపుతున్నాయి.

దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. ఏ పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలు బలపడకుండా పకడ్బందీ రాజకీయ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మరింత దగ్గర చేసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పదవిని అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో పదవులు ఆశించే సీనియర్ నాయకుల జాబితా చాలా పెద్దదిగానే ఉందనే టాక్.  యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి లాంటి ఉద్దండులైన నేతలు రేసులో ఉన్నారు. అయితే యనమల రామకృష్ణుడు కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడంతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కోసం పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మహిళా నేత ప్రతిభా భారతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వరుసగా 5 సార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. మంత్రి పదవులతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ స్పీకర్ పదవిని కూడా ఆమె సమర్థవంతంగా చేపట్టారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సమర్థురాలైన మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఈ గవర్నర్ పదవుల కేటాయింపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *