ఒకప్పుడు వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ తరువాత నెంబర్ 2గా వెలిగిన వ్యక్తి ఎవరంటే టక్కున అందరు చెప్పే పేరు విజయ సాయి రెడ్డి. అవును జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా వైసీపీలో జగన్ తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా ఉన్న ఆయన అక్కడ జరుగుతున్న పరిణామాలతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఈ మధ్య వైసీపీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలతో ఆ పార్టీని గట్టిగానే ఇరుకునపెడుతున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన వ్యాఖ్య వైసీపీ శ్రేణుల్లో మరింత అలజడికి కారణమైందనే టాక్ వినిపిస్తోంది. అది కూడా ప్రస్తుతం జగన్ కు అన్నీ తానే అయి వ్యవహరిస్తున్న సజ్జలను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో నెంబర్ వన్ సజ్జలే అని జగన్ నెంబర్ 2 అంటూ ఆయన రాసిన లేఖ వైసీపీకి గట్టిగానే తగిలే విధంగా ఉంది. ఇక ఆయన లేఖ గురించి చూస్తే
వైయస్సార్సీపీ “కోటరీ” తన మీద “నమ్మక ద్రోహి” అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచార పోస్టులు పెట్టిస్తున్నందున ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్లో నా పేరు లేకుండా చేసుకునేవాడిని, జగన్ కి నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్ తో పాటు ప్రతి చార్జిషీట్లోనూ నన్ను ఎ-2గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తనను 15 నెలలు జైల్లో పెట్టారని తాను జగన్ కు ఎంత నమ్మకంగా నిలబడ్డారో విజయసాయి ఈ లేఖలో పేర్కొన్నారు. నమ్మక ద్రోహం నా రక్తంలో ఉంటే, అప్పుడే అప్రూవర్‌గా మారేవాడిని అంటూ ఘాటుగానే తన వాదన వినిపించారు. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో ఎ-5గా చేర్చారు. కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2 గా చేర్చారు. ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో “సకల శాఖల మంత్రి” పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్లోనూ లేరు అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. జగన్‌గారికి వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలవకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో, ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న “కోటరీ నాయకుడు”కి తెలిసినంత నాకు తెలవదు. నేను ఏనాడూ అలాంటి నమ్మక ద్రోహం పనులు చేయలేదని కుండబద్దలు కొట్టారు.
40ఏళ్ళు అత్యంత నమ్మకస్తుడిగా పని చేసిన నేను, నా ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించారని PMO లో ఢిల్లీ లో, పార్టీ లో, అవమానకరం గా అంచలంచెలుగా తగ్గించింది ఎవరు ?పొమ్మనలేక పొగ పెట్టింది ఎవరు…? అతిపెద్ద 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా శృతి మించింది… పార్టీ కి నా సేవలు ఏంటి, సజ్జల ద్రోహం ఏంటి, పరిపాలన జగన్ చేశారా, “సజ్జల” సకల శాఖ మంత్రి గా, ఒక రాజ్యాంగేతర శక్తి గా తన ముఠా తో చేసిన పాలన లో, జగన్ ని.. ఎలా ఎవ్వరిని కలవకుండా MLA లను, MP లను, మంత్రులకు సహితం అపాయింట్మెంట్ లు లేకుండా గోడ కట్టింది ఈ సజ్జల కాదా? అంటూ తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు.
ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేక 4సం, రాజ్యసభ పదవీ కాలాన్ని వదులుకొని… వైసీపీ గుర్తుపై ఎన్నికైనందుకు నైతికసూత్రాన్ని పాటిస్తూ రాజీనామా చేయడం జరిగింది. జగన్ ని నేను రెండు సంవత్సరాలు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడలేదు. కోటరీ కారణంగా నాకు జరిగిన అవమానాల కారణంగా బయటకు వచ్చా అని పదేపదే చెప్పాను. అయినా, అదే కోటరీ వారంతా, ఈ రోజు నేను పార్టీ పెడతానంటే నన్ను విమర్శిస్తున్నారు… నేను నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్దం గా యుద్ధం చేస్తా … అంతే గాని… అప్పట్లో ప్రభుత్వాన్ని, ఇప్పుడు పార్టీని కబ్జా చేసి… జగన్ ని రోజు మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం నాకు చేత కాదు … ఇది విజయసాయి రెడ్డి గా నా మాట. అనేక విషయాల్లో ఆత్మాభిమానం మీద కొడుతుంటే తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన తన లేఖలో పేర్కొన్న వాటిలో సంచలనంగా మారిన విషయం మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో నేరుగా ఈ సకల శాఖ మంత్రి తన మీద డెరైక్టుగా, భౌతికంగా దాడి చేస్తే జగన్ కి తెలిసి ప్రేక్షకపాత్ర వహించారని చెప్పడం వైసీపీ శ్రేణులను కూడా విస్మయానికి గురిచేసింది. ఈ విషయం పార్టీలో అక్కడున్న నాయకులు కూడా చూశారని తన లేఖలో విజయసాయి పేర్కొనడం అబ్బో వైసీపీలో ఇంత జరిగితేనే ఆయన పార్టీకి దూరమయ్యారా ? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక తాను నమ్మకస్తుడినే అయినా తనను టార్గెట్ చేయించటంలో కోటరీ సక్సెస్ అయ్యిందని వాపోయారు. ఇలాంటి అవమానాలు మొత్తం 74 ఉన్నాయని చెప్పారు. ఇక ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో నంబర్ 2 ఎవరంటే జగన్. ఇప్పుడు నంబర్ వన్ ఎవరంటే “సకల శాఖల మంత్రి సజ్జల” అని విజయసాయి అనడం వైసీపీ పరిస్థితి నిజంగా అలాగే ఉందా అని ఇతర పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నాయి. ఇక విజయసాయి జగన్ కు నమ్మక ద్రోహం చేయలేదని చేయనని తన లేఖలో స్పష్టంగా తెలిపారు. పార్టీలో ఉండి, ఎవరు కోవర్టుగా పని చేస్తున్నారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆలోచన చేసుకోవాలని ఈ నిజాలు చెప్పకపోతే, విమర్శలు మాత్రమే ప్రచారంలోకి వస్తున్నాయి. మరో సందర్భంలో మీడియా ద్వారా మరిన్ని నిజాలు తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.