అజిత్ దోవల్ వ్యూహాల వలెనే పాక్ లో అస్థిరత…పాక్ పిచ్చి ప్రేలాపనలు.!

అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరున్న అపరమేధావి. శత్రుదేశాల ఆటలు కట్టించడంలో ఆయన వ్యూహాలు చాలా ప్రత్యేకం. భారత్ కు ఎవరైనా ఎదురునిలిస్తే తనదైన శైలిలో వ్యూహాలతో చెక్ పెట్టడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాం. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాను కు కూడా ఆయన చేతిలో పలుమార్లు భంగపాటు తప్పలేదు. అందుకే దేశ వ్యతిరేకులకు కూడా ఆయనంటే గిట్టదు. తాజాగా పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మజహర్ జమీల్ కూడా ఆయనపై అసహనాన్ని ప్రదర్శించారు. కొన్ని రోజుల క్రితం లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ లో అతను చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ లో అశాంతి సృష్టించడానికి భారత్ ఏదో చేస్తున్నట్లు అసంబద్ద ప్రేలాపనలు మాట్లాడారు. టీటీపీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీ.ఎల్.ఏ) లకు భారత్ మద్దతిస్తుందంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. అజిత్ దోవల్ అనుసరిస్తున్న భద్రతా వ్యూహాల వల్ల పాకిస్థాన్లో అస్థిరత ఏర్పడుతోందని అలాగే అక్కడితో ఆగకుండా 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు వాగారు.
అలాగే ‘పహల్గామ్’ ఉగ్రదాడి దుర్ఘటనకు ప్రతిచర్యగా జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ లో అణు ఆయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ మిస్సైల్స్ ను భారత్ ఉపయోగించిందని
ఆరోపించారు. భారత్ అవలంబిస్తున్న 'నో ఫస్ట్ యూజ్ అంటే మొదటిగా అణ్వాయుధాలు ప్రయోగించము అనే విధానం ఒక డిప్లామెటిక్ స్ట్రాటజీ మాత్రమేనని, మొదటిసారే
దాడి చేసేలా భారత్ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని అక్కసును వెళ్లగక్కారు. తామేదో శాంతి దూతలం అయినట్లు జమీల్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచదేశాలు కూడా నమ్మే విధంగా లేవు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సౌత్ ఆసియా మొత్తాన్ని భారత్ అణు విపత్తు దిశగా తీసుకెళ్లిందని, అయితే పాకిస్థాన్ స్ట్రాటెజిక్ బ్యాలెన్స్ వలెనే పరిస్థితి చక్కబడిందని జమీల్ చేసిన కామెంట్స్ ఎవరికైనా నవ్వు తెప్పించేవే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అరాచక శక్తులతో అంటకాగే పాక్ శాంతిని పరిరక్షించే విధంగా డప్పు కొంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పాకిస్థాన్ చేసిన ఈ అసంబద్ద ఆరోపణలకు భారత్ గట్టి బదులిచ్చింది. భారత ప్రభుత్వ వర్గాలు దీనిని పూర్తిగా ఖండించాయి. ఉగ్రవాద సంస్థలను తమ ఎన్నికల ప్రక్రియలో భాగం చేస్తూ, ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారిన పాకిస్థాన్ కు భారత్ సెక్యూరిటీ పాలసీలను ప్రశ్నించే అర్హత లేదని సరైన సమాధానం ఇచ్చాయి. బోర్డర్ టెర్రరిజమ్ పై భారత్ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానం కొనసాగుతుందని అది గిట్టకే పాకిస్థాన్ ఇలాంటి వాదనను తీసుకొస్తోందని గట్టిగా బదులిచ్చాయి. సొంత దేశంలో పరిస్థితిని అదుపు చేసుకోలేక శాంతి భద్రతలు పరిరక్షించుకునే పరిస్థితి లేక ఇలా భారత్ పై అవాకులు చెవాకులు పేలుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా ఎద్దేవా చేస్తున్నారు.



