విరాట్ టెస్టు రిటైర్మెంట్ పై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..!

విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్. మైదానంలో చురుకుగా కదులుతూ ఒక మెరుపులా కనిపిస్తాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలోనైనా విరాట్ మైదానంలో ఉన్నాడంటే ఆ జోషే వేరు. స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటాడు. అలాంటి కోహ్లీ టెస్టులకు, టీ 20లకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కనిపిస్తుండడం కొందరు అభిమానులకు ఇప్పటికీ మింగుడు పడడంలేదు. అంత ఫిట్ నెస్ తో ఉండే కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ లో కూడా ఇంకా ఆడుతూ ఉంటే చూడాలని కోరుకుంటున్నారు. 2011 నుండి టెస్టు క్రికెట్ ఆడుతున్న కోహ్లీ గతేడాది మే 12న రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంత అత్యుత్తమ క్రికెటర్ అప్పుడే టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ కావడం చాలా మంది అభిమానులకు కష్టంగానే అనిపించింది. 123 టెస్టులు ఆడిన కోహ్లీ 46.85 యావరేజ్ తో 9,230 పరుగులు చేశాడు. 7 డబుల్ సెంచరీలతో కలుపుకుని మొత్తం 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో విజయవంతంగా నడిపించిన కెప్టెన్ గా కూడా కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కోహ్లీ టెస్టు క్రికెట్ ఇంకా ఆడుతూ ఉంటే బాగుండేదని చాలా మంది ప్రముఖుల నుండి అభిమానుల వరకు అనుకుంటూనే ఉన్నారు. తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా విరాట్ కోహ్లీ తన కెరీర్లో అతిపెద్ద తప్పు చేశాడని, 10 ఏళ్ల తర్వాత ఆ నిర్ణయంపై కచ్చితంగా పశ్చాత్తాప పడతారన్నారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే కోహ్లీ ఫిట్నెస్ అద్భుతమని ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్లు అసహనంతో లేదా కోపంతో రిటైర్మెంట్ ప్రకటించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టులో ప్లేస్ కోసం వెనక్కి తగ్గకుండా పోరాడాలని మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నోసార్లు జట్టు నుంచి పక్కకు పెట్టినా అమర్నాథ్ పట్టుదలతో తిరిగి పునరాగమనం చేసిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక ఏది ఏమైనా అది విరాట్ కోహ్లీ నిర్ణయమని అభిమానులు కొందరు కోహ్లీ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో విరాట్ అందులో రాణించి భారత్ ను మరోసారి విశ్వ విజేతను చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడు. 2027లో కూడా వరల్డ్ కప్ భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.



