ఎవరీ గరివిడి లక్ష్మి ? ఈమె కథేంటి?
కామెంట్లు (0)

తెలుగునాట జానపద పాటలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ , ఉత్తరాంధ్ర విప్లవ కవి వంగపండు ప్రసాదరావు. కొన్ని దశాబ్దాల పాటు తమ ఆటపాటలతో ప్రజలను చైతన్య పరిచిన ఈ మహానుభావుల జీవిత చరిత్రలు ఇంతవరకు వెండితెరపై బయోపిక్ గా రాలేదు. కానీ, ఈ ఇద్దరు దిగ్గజాలకు దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా జానపద కళాకారిణికి దక్కుతోంది. ఆమె పేరే గరివిడి లక్ష్మి . పల్లెటూరి జానపదాలను, బుర్ర కథలను తనదైన బాణీలో స్టేజ్ మీద ప్రదర్శించి 90వ దశకంలో యావత్ ఉత్తరాంధ్రను ఊపేసిన ఈ కళాకారిణి జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్ ను తెరకెక్కించింది. గరివిడి లక్ష్మి.. ఉత్తరాంధ్ర జానపద కళకు ఒక ప్రత్యేకమైన బాణీని, ఊపును అందించిన అద్భుతమైన కళాకారిణి. ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలంలోని గెడ్డపు వలస ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచే పాటల మీద ఉన్న మక్కువతో 1994లో ఆమె మొదటిసారి స్టేజీ ఎక్కి జానపద పాటలు, బుర్రకథలు చెప్పడం మొదలు పెట్టింది. ఆమె గొంతులో ఉన్న ఆ పల్లెటూరి స్వచ్ఛత, ఆ యాస జనాలకు విపరీతంగా నచ్చేసింది. చూస్తుండగానే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తన జీవితకాలంలో ఆమె దాదాపు పది వేలకు పైగా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చిందని చెబుతారు. ఆ క్రేజ్ చూసి 1996లో శ్రీమాతా ఆడియో కంపెనీ ద్వారా ఆమె బుర్రకథలు, పాటలు క్యాసెట్లు, వీడియోల రూపంలో మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. చందమామా, ఓ అత్తరు సాయిబో రారా, రాతిరి నల్లోడా, నాను శ్రీకాకుళం జిల్లండి, పాలకొండ ఎళ్లిపోతా లాంటి జానపద గీతాలతో అప్పట్లో యువతను గరివిడి లక్ష్మి ఓ ఊపు ఊపేసింది. ఆమె పాటల్లో కాస్త ద్వంద్వార్థాలు ధ్వనించినప్పటికీ, మాస్ ఆడియన్స్ మాత్రం ఆ పాటలకు ఫిదా అయిపోయారు.



