చందమామపై అన్ని పగుళ్లా?..కలవరపెడుతున్న కొత్త నిజాలు
కామెంట్లు (0)

ప్రశాంతంగా కనిపించే ఆ చల్లని చంద్రుడి మీద జరుగుతున్న మార్పులు కలవరపెడుతున్నాయి. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై ఒక విధ్వంసం జరుగుతోంది. ఏకంగా 10 వేల పగుళ్లు ఏర్పడి చంద్రుడు కుంచించుకుపోతున్నాడు. ఇప్పటికే ఏకంగా 148 అడుగుల మేర జాబిల్లి సైజు తగ్గిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సంచలన నివేదికను బయటపెట్టారు.
చంద్రుడు భూమి లాగా గ్రహం కాదు అయితే మరి అక్కడ భూకంపాలు, పగుళ్లు ఎలా వస్తాయన్న సందేహం మీకు రావచ్చు. కానీ నాసా ప్రయోగించిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ పంపిన వేలాది చిత్రాలను విశ్లేషించిన తర్వాత శాస్త్రవేత్తలకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. గత కొన్ని కోట్ల సంవత్సరాలుగా చంద్రుడు మెల్లమెల్లగా కుంచించుకుపోతున్నాడని వారు గుర్తించారు.
దీనికి సైన్స్ చెబుతున్న కారణం ఒక్కటే.. చంద్రుడి అంతర్భాగం ఒకప్పుడు అత్యంత వేడిగా ఉండేది. కాలక్రమేణా ఆ వేడి చల్లబడుతూ వస్తోంది. ఒక వేడి వస్తువు చల్లబడినప్పుడు అది ఎలాగైతే కుంచించుకుపోతుందో, చంద్రుడు కూడా అలాగే ముడుచుకుపోతున్నాడు.
చంద్రుడి పైపొర పెళుసుగా ఉండటం వల్ల ఆ ఒత్తిడికి తట్టుకోలేక ముక్కలైపోయి, ఉపరితలం నిండా 10,000 కు పైగా భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. మెట్ల లాగా ఏర్పడిన ఈ పగుళ్లు కొన్ని చోట్ల పదుల అడుగుల ఎత్తులో కమాన్లాగా నిలబడి ఉన్నాయి. ఈ కుంచించుకుపోవడం ఏదో నిన్న మొన్న మొదలైంది కాదు.. గత కొన్ని కోట్ల సంవత్సరాలుగా చంద్రుడి సైజు దాదాపు 148 అడుగుల మేర తగ్గిపోయిందని నాసా డేటా స్పష్టం చేస్తోంది. చంద్రుడు మన భూమి నుంచి సుమారు మూడున్నర లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి.. ఆ 148 అడుగుల మార్పు మనకు భూమి మీద నుంచి పెద్దగా తెలియదు. అయితే ఈ మార్పు వల్ల చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన ప్రకంపనలు, అంటే మన భాషలో చెప్పాలంటే మూన్ క్వేక్స్ వస్తున్నాయి. భూమిపై వచ్చే భూకంపాలు కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటు మాత్రమే ఉంటాయి. కానీ చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి, అక్కడ వచ్చే ప్రకంపనలు ఏకంగా గంటల తరబడి కొనసాగుతాయి. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఈ మూన్ క్వేక్స్ ప్రభావం, పగుళ్ల తీవ్రత చాలా దారుణంగా ఉందని నాసా పరిశోధకులు తాజాగా గుర్తించారు. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు శాస్త్రవేత్తల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
చంద్రుడు కుంచించుకుపోతే మనకేముందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనుషులు మళ్లీ చంద్రుడి పైకి వెళ్లడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ పేరుతో ఒక భారీ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ ఆర్టెమిస్-3 మిషన్ ద్వారా 2026-27 నాటికి వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధృవం వద్ద దించాలని, భవిష్యత్తులో అక్కడ శాశ్వత లూనార్ బేస్ నిర్మించాలని నాసా ఒక బృహత్తర ప్రణాళికను రచించింది. కానీ, ఇప్పుడు నాసా ల్యాండ్ అవ్వాలనుకుంటున్న ఆ దక్షిణ ధృవం వద్దే ఈ పగుళ్లు, గంటల తరబడి సాగే మూన్ క్వేక్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడం కలకలం రేపుతోంది.
ఒకవేళ వ్యోమగాములు అక్కడ ల్యాండ్ అయిన సమయంలో భారీ ప్రకంపనలు వస్తే.. స్పేస్‌క్రాఫ్ట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఆ మూన్ క్వేక్స్ వల్ల కొండచరియలు విరిగిపడటం, పరికరాలు ధ్వంసమవ్వడం జరిగితే వ్యోమగాముల ప్రాణాలకే తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఆర్టెమిస్ మిషన్ ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా, సెల్ఫ్-డిఫెన్స్ పరిజ్ఞానంతో మార్చుకోవాల్సిన ఒత్తిడి నాసాపై పడింది. చంద్రుడిపై వాతావరణం, వనరులను వాడుకుని భవిష్యత్తులో అంగారక గ్రహం పైకి మనుషులను పంపాలని ప్లాన్ చేస్తున్న అంతరిక్ష సంస్థలకు.. ఈ కొత్త పగుళ్లు , మూన్ క్వేక్స్ అనేవి ఇప్పుడు ఒక అతిపెద్ద ఛాలెంజ్‌గా మారాయి. అయితే, చంద్రుడు ఇలా సన్నబడుతున్నప్పటికీ దాని వల్ల భూమికి వచ్చిన ప్రత్యక్ష ప్రమాదం ఏమీ లేదని, అలల కదలికలపై కూడా ఎలాంటి తీవ్ర ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.



