నీటి కొరత…యాసంగిలో వరి వేయొద్దు రైతులకు సీఎం విజ్ఞప్తి
కామెంట్లు (0)

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లన్నీ ఖాళీ అవుతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయం, తాగునీరు, కరెంట్ సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన చేశారు. రాబోయే యాసంగి సీజన్లో రైతులు వరి పంట వేయొద్దని, ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి చుక్క నీటినీ, ప్రతి యూనిట్ కరెంట్ను పొదుపుగా వాడుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
తెలంగాణ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కరువు పరిస్థితులపై సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో 462 టీఎంసీల నీరు ఉంటే, ఈసారి అది కేవలం 209 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ ఏడాది 23 శాతం లోటు వర్షపాతం వల్ల, కృష్ణా బేసిన్లో ఏకంగా 72 శాతం, గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తగ్గిపోయాయని అయినప్పటికీ, ప్రస్తుతం చేతికొచ్చిన వరి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చివరి తడి వరకు నీరు అందిస్తుందని, ఒక్క ఎకరం కూడా ఎండనివ్వబోమని భరోసా ఇచ్చారు.
అయితే, అసలు సమస్య రాబోయే 8 నుంచి 10 నెలల పాటు ఉండబోతోందని గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, 24 వేల పల్లెలు, తండాలకు తాగునీటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే రాబోయే యాసంగి సీజన్లో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును వాయిదా వేసుకుని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ సిటీకి తాగునీరు అందించే నాగార్జునసాగర్, సింగూరు, గండిపేట, హిమాయత్ సాగర్ లాంటి జలాశయాలు అడుగంటుతున్న నేపథ్యంలో నగరవాసులకు కూడా సీఎం పలు సూచనలు చేశారు. చుక్క నీరు కూడా వేస్ట్ చేయొద్దని కోరారు. ఈ నీటి సంక్షోభాన్ని పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఒక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.



