ఫేక్ వాట్సాప్ ఛానల్ నిర్వాహకులకు హెచ్చరిక.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన

డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ, ప్రముఖుల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు మరియు వాట్సాప్ ఛానెళ్లు సృష్టించడం సర్వసాధారణమైపోయింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు మరియు చిత్రాలను ఉపయోగిస్తూ హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ ప్రొఫైళ్లను నిర్వహిస్తున్నారు. ఇటువంటి నకిలీ హ్యాండిల్స్ చూడటానికి అసలైన ఖాతాల లాగే అనిపించడంతో సాధారణ ప్రజలు చాలా సులభంగా వీటికి ఆకర్షితులవుతున్నారు. అధికారికంగా కనిపించే ముసుగులో వచ్చే సమాచారాన్ని నిజమని నమ్మి, ప్రజలు మోసపోవడానికి ఈ పరిస్థితి కారణమవుతోంది.
ఈ తరహా నకిలీ ఖాతాలను ప్రధానంగా తప్పుడు సమాచారాన్నివేగంగా వ్యాప్తి చేయడానికి, ప్రజల్లో అపోహలు సృష్టించడానికి లేదా రాజకీయ, సామాజిక లాభాల కోసం ఉపయోగిస్తున్నారు. కొందరు కేవలం ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఇలా చేస్తే, మరికొందరు పెట్టుబడులు, ఉచిత పథకాలు, పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల పేరు మీద వచ్చే అనధికారిక ప్రకటనలు సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా, సదరు ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వాట్సాప్ ఛానెళ్ల ద్వారా ఒకేసారి వేలాది మందికి క్షణాల్లో తప్పుడు వార్తలు చేరిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరిట నకిలీ వాట్సప్ ఛానల్ పై డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. “Deputy CMO, Andhra Pradesh” పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అఫీషియల్ ఛానల్ కాదని ఈ అనధికారిక ఛానల్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఇన్ఫర్మేషన్ ను ప్రచారం చేస్తోన్నట్లు గుర్తించింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఇటువంటి చర్యలపై డిప్యూటీ సీఎం కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది.
ఈ నకిలీ చానల్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన చర్యలు తీసుకున్నట్లు అలాగే బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పింది.
ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు నమ్మవద్దని, ఫాలో అవ్వవద్దని అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని ఈ సందర్భంగా సూచించింది. అధికారిక తాజా వివరాల కోసం అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా అకౌంట్ లను అలాగే ధృవీకరించబడిన వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే ఫాలో కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బాధ్యులైన వారిని చట్టం ఏదుట నిలబెట్టి, తగిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంది. ఇటువంటి డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రతిఒక్కరికీ అవగాహన మరియు అప్రమత్తత చాలా అవసరం. సోషల్ మీడియాలో ఏదైనా ప్రముఖమైన వార్త లేదా సమాచారం కనిపించినప్పుడు, ఆ ప్రొఫైల్‌కు అధికారిక బ్లూ టిక్ ఉందో లేదో సరిచూసుకోవాలి. అధికారిక వెబ్సైట్లు లేదా విశ్వసనీయమైన వార్తా సంస్థల ద్వారా ఆ వార్త నిజమో కాదో నిర్ధారించుకున్నాకే ఇతరులకు షేర్ చేయాలి. అనుమానాస్పదంగా అనిపించే ఖాతాలు, వాట్సాప్ ఛానెళ్లపై సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లలో రిపోర్ట్ చేయడం ద్వారా ఈ రకమైన సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.



