భారత్ కు మాజీ ప్రధాని షేక్ హసీనా ధన్యవాదాలు…డిసెంబర్ లో స్వదేశానికి అంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు
కామెంట్లు (0)

డిసెంబరులో తాను తన స్వదేశమైన బంగ్లాదేశ్ తిరిగి వెళ్లనున్నట్లు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి పునరుద్ఘాటించారు. తనకు ఏమాత్రం భయం లేదని వారు నన్ను చంపవచ్చు, అరెస్టు చేయవచ్చు అని తనకు తెలుసు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తన దేశానికి తిరిగి వెళ్లడం తన బాధ్యతని స్పష్టం చేశారు. తాజాగా ఆమె భారత దేశానికి ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ తనకు ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలు, నిరసనలు, ప్రజా తిరుగుబాటు కారణంగా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం కోసం వచ్చారు. బంగ్లాదేశ్లో 1971 స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు తిరిగి కల్పించాలని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఉద్యమించడం, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం తెలిసిందే. ఇక విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రఉద్రిక్త పరిస్థితుల వైపు వెళ్లాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఉద్యమం కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా అప్పటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపుదాల్చింది.
పరిస్థితి పూర్తిగా హింసాత్మకంగా మారడంతో ఆగస్టు 5, 2024న లక్షలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నిచుట్టుముట్టేందుకు దూసుకువచ్చారు. సైన్యం కూడా పరిస్థితి అదుపుచేయలేకపోవడంతో ఆమె రాజీనామా తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. ఇక భారత్ ఆశ్రయం కల్పించడం ఇదేమి మొదటి సారి కాదు. షేక్ హసీనా కుటుంబానికి, భారతదేశానికి దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1975లో బంగ్లాదేశ్లో జరిగిన సైనిక తిరుగుబాటులో హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ మరియు ఆమె కుటుంబ సభ్యులందరు దారుణంగా చంపబడ్డారు. ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ హసీనాకు రాజకీయ ఆశ్రయం కల్పించి, ఆరేళ్ల పాటు ఢిల్లీలో రక్షణ కల్పించారు. ఆ నమ్మకంతోనే 2024లో కూడా ఆమె భారత్ నే ఆశ్రయం పొందేందుకు సేఫ్ అని భావించారు. ఇక
ఆమెపై బంగ్లాదేశ్ కోర్టులు మరణశిక్ష విధించినప్పటికీ, తాజా ఇంటర్వ్యూలలో తాను స్వదేశానికి తిరిగి వెళ్లి న్యాయస్థానాలను ఎదుర్కొంటానని షేక్ హసీనా స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వం ఏర్పడి, తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా రాజీనామా చేసి అక్కడి నుండి భారత్ కు వచ్చిన తరువాత కూడా హింసాత్మక దాడులు జరిగాయి. ముఖ్యంగా ఒక వర్గాన్ని టార్గేట్ గా చేసుకుని జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమయ్యాయి. ఇక హసీనా స్వదేశానికి వెళతానని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్ లో నెలకొంటాయో చూడాలి.



