భారత్లో బంగ్లాదేశ్ తరహా కుట్ర?..రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్!
కామెంట్లు (0)

దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిరసనల వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని, ఏకంగా దేశ భద్రతకే ముప్పు పొంచి ఉందంటూ.. సాక్షాత్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను కుర్చీ దించి, దేశం విడిచి పారిపోయేలా ఎలా చేసిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు సరిగ్గా అదే బంగ్లాదేశ్ తరహాలోనే.. భారతదేశంలో కూడా ఒక అస్థిరతను, అశాంతిని సృష్టించి మోదీ ప్రభుత్వాన్నికూల్చివేయడానికి పక్కా ప్లాన్ జరుగుతోందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఇతర విపక్ష పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనంగా మారిన పాయింట్.. బంగ్లాదేశ్ పరిస్థితులతో రాజ్నాథ్ సింగ్ చేసిన పోలిక. లక్నోలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు రాజకీయ నాయకులు బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక పరిణామాల నుంచి ప్రేరణ పొందారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ యువతను పావులుగా వాడుకుంటున్నాయి. వాళ్లకు యువత భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదు, పట్టింపు కూడా లేదు. కేవలం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం, ప్రభుత్వాలను మార్చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం ద్వారా దేశంలో అరాచకత్వాన్ని సృష్టించి ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే వాళ్ల ఏకైక ఎజెండా అని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ఎన్నికల ద్వారా కాకుండా ఇలా వీధి పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు దేశ ప్రజాస్వామ్య పునాదులను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, శాంతిభద్రతలకు ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు. ఈ రాజకీయ కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, స్థిరత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక ఇటీవల ఢిల్లీలో విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై కూడా రాజ్నాథ్ సింగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమి గానీ, ఇతర పార్టీలు గానీ చేపట్టిన ఈ ఆందోళనలు కేవలం ఎన్నికల సంస్కరణల కోసమో.. లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగానో జరుగుతున్నవి కావని ఆయన స్పష్టం చేశారు. ఆ నిరసనల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. బంగ్లాదేశ్ తరహాలో తమ ప్రభుత్వాన్ని కూలదోయడమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం విపక్షాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ఎప్పుడూ గౌరవిస్తుందని, వాటి పవిత్రతను కాపాడటమే తమ సిద్ధాంతమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే ప్రెస్మీట్లో ఉత్తర ప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి కూడా రాజ్నాథ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన సెటైర్లు వేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై దాదాపు 37 ఏళ్లు దాటిందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. అయితే, సమాజ్వాదీ పార్టీ మద్దతు లేకుండా రాహుల్ గాంధీకి సొంతంగా రాయ్బరేలీలో గెలిచే సామర్థ్యం ఉందా? అని రాజ్నాథ్ సింగ్ బహిరంగ సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సొంత బలం లేకపోయినా.. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలతో పెట్టుకున్న పొత్తుల వల్లే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన చురకలు అంటించారు. మొత్తానికి దేశ రక్షణ మంత్రి హోదాలో ఉన్న రాజ్నాథ్ సింగ్ నేరుగా ప్రతిపక్షాలపై బంగ్లాదేశ్ తరహా కుట్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై కచ్చితంగా ఘాటుగానే స్పందించే అవకాశం ఉంది.


