యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఐడియాస్ కు ప్రధాని మోదీ ఫిదా…ఎవరీ తేజస్ సుదర్శన్ ..?
కామెంట్లు (0)

ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే ఇంప్రెస్ చేశాడో కుర్రాడు. తనకు వచ్చిన అవకాశాన్ని భలే తెలివిగా వాడుకున్నాడు. ఆ కుర్రాడి పేరు తేజస్ సుదర్శన్. అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి పూనమల్లి వరకు మెట్రో ట్రైన్లో ప్రయాణించారు. ఆ మెట్రో ప్రయాణంలో ప్రధానితో ముఖాముఖి మాట్లాడటానికి, తమ ఐడియాలు పంచుకోవడానికి ప్రభుత్వం 17 మంది స్టార్టప్ వ్యవస్థాపకులను ఎంపిక చేసింది. అందులో ఈ తేజస్ కూడా ఒకరు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరూ ప్రధానితో మాట్లాడుతున్నారు. కానీ టైమ్ చాలా తక్కువగా ఉండటంతో.. తన వంతు వచ్చేసరికి రైలు స్టేషన్‌కు చేరుకుంది. ఇంకేముంది ప్రధానితో మాట్లాడే ఛాన్స్ మిస్ అయింది అని తేజస్ అనుకున్నాడు. సరిగ్గా అదే టైంలో ప్రధాని మిగిలిన వాళ్ళ మాటలు కూడా నేను వింటాను అని చెప్పడంతో తేజస్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 90 సెకన్ల సమయం మాత్రమే దొరికింది. దొరికిన ఆ నిమిషంన్నర సమయంలోనే తన మెదడుకు పదునుపెట్టి రెండు అద్భుతమైన ఏఐ ప్రపోజల్స్ ప్రధాని ముందు ఉంచాడు. అందులో మొదటి ఐడియా, ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సాధారణంగా మన విద్యార్థులు కాలేజీల్లో చదువుకుని బయటకు వస్తారు కానీ వాళ్లకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. దీనికి పరిష్కారంగా.. ప్రభుత్వ విభాగాలు విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. ప్రభుత్వం ఎదుర్కొంటున్న రియల్ టైమ్ సమస్యలను విద్యార్థులకు ప్రాజెక్టులుగా ఇవ్వాలి. దాన్ని సాల్వ్ చేయడానికి విద్యార్థులు ఏఐ అప్లికేషన్లను వాడితే.. అటు ప్రభుత్వానికి పరిష్కారం దొరుకుతుంది, ఇటు విద్యార్థులకు చదువుకునే వయసులోనే ప్రభుత్వ పరిపాలనా సవాళ్లను పరిష్కరించిన అనుభవం వస్తుంది అని చెప్పాడు.
ఇక రెండవ ఐడియా, సింగిల్ AI సర్వీస్ డెస్క్. మనలో ఎవరైనా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఎంత విసుగొస్తుందో తెలుసు కదా. ఒక సర్టిఫికెట్ కోసం ఆధార్ అంటారు, పాన్ అంటారు.. పది ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. దీనికి తేజస్ ఒక క్రేజీ సొల్యూషన్ చెప్పాడు. ఒక ఏఐ-ఆధారిత సర్వీస్ డెస్క్ తీసుకురావాలి. అందులో పౌరులు తమ అభ్యర్థనలను సమర్పించి, పత్రాలను ఒక్కసారి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఒక AI ఏజెంట్ ఆ అభ్యర్థనను ట్రాక్ చేసి, ఏ ఆఫీసుకు వెళ్లాలో.. ఎవరికి పంపాలో అదే కరెక్ట్‌గా పంపిస్తుంది. అని వివరించాడు. దీనివల్ల ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఈ రెండు ఐడియాలను కేవలం 90 సెకన్లలో ప్రధానికి అర్ధం అయ్యేలా చాలా క్లియర్‌గా వివరించాడు. అసలు ఈ తేజస్ సుదర్శన్ ఎవరు అంటే.. అతను ఒక పక్కా ఎంట్రప్రెన్యూర్ . అతను అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేసే విన్సెన్ ల్యాబ్స్ అనే స్టార్టప్‌ను స్థాపించాడు. దానికి ముందు అతను ప్రఖ్యాత సంస్థ KPMG ఇండియాలో పనిచేశాడు. అలాగే ఫ్యాన్పిట్ అనే ఈవెంట్స్ అండ్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా రన్ చేశాడు. ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత తేజస్ లింక్డ్ఇన్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 2017లో నా పాఠశాల విద్యార్థుల నాయకుల ఎన్నికల సమయంలో.. విద్యార్థుల చదువును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ క్లాస్‌రూమ్‌ని ఉపయోగించాలని నేను స్పీచ్ ఇచ్చాను. ఆ తర్వాత సరిగ్గా తొమ్మిదేళ్ల అనంతరం ఏకంగా ప్రధానమంత్రితోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించే అవకాశం పొందడం నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక చిన్న స్కూల్ ఎన్నికల ప్రసంగం నుంచి ఏకంగా దేశ ప్రధానితో ముఖాముఖి మాట్లాడే రేంజ్‌కి చేరుకోవడం నిజంగా అభినందనీయం.


