వారణాసిలో అందమైన ప్రేమకథ..అంచనాలు ఇంకాస్త పెంచేసిన రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ఒకవైపు ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతూ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు రాజమౌళి అండ్ టీమ్ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమాకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ను రివీల్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ సైన్స్ ఫిక్షన్లా అనిపించినప్పటికీ, ఇందులో అందమైన ప్రేమకథ దాగి ఉందని రాజమౌళి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వారణాసి కథ పరిమాణం చాలా పెద్దది. దాన్ని ఆ స్థాయిలోనే తెరపైకి తీసుకురావడం ఈసారి నాకు ఎదురైన అతి పెద్ద సవాల్ అని జక్కన్న స్వయంగా అంగీకరించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపూ ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించినప్పటికీ.. దాని మూలాల్లో ఇదొక పౌరాణిక అంశాలతో రూపొందించిన ఫాంటసీ చిత్రం అని చెప్పారు. అంటే మన పురాణాల్లోని అద్భుతమైన అంశాలకు, మోడ్రన్ టెక్నాలజీని, అడ్వెంచర్ ను మిక్స్ చేసి ఇండియానా జోన్స్ తరహాలో ఒక విజువల్ వండర్ ను క్రియేట్ చేయబోతున్నారన్న మాట. కేవలం యాక్షన్, అడ్వెంచర్ మాత్రమే కాకుండా ఈ కథలో ఒక బలమైన ఎమోషన్ ఉందని రాజమౌళి తెలిపారు. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు, ఒక అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది అని ఆయన చెప్పారు.
అలాగే వారణాసిలో జరిగే ఘట్టాలైనా సరే... దట్టమైన ఆఫ్రికా అడవుల్లో, అలాగే మంచుతో గడ్డకట్టుకుపోయే అంటార్కిటికా లో జరిగే భారీ యాక్షన్ సన్నివేశాలైనా... ముఖ్యంగా ఉగ్రబట్టి గుహలకు సంబంధించిన ఆ కాల ప్రయాణ ఘట్టమైనా ... ఇలా సినిమాలో వచ్చే ప్రతి ఎపిసోడ్ ఓ ప్రత్యేకమైన, సరికొత్త సినిమాలా ఉంటుంది అని రాజమౌళి వెల్లడించారు.



