సౌదీలో ఆగని దాడులు…వణుకుతున్న గల్ఫ్ దేశాలు..భారతీయులకు హై అలర్ట్!

మిడిల్ ఈస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయిల్ ఫీల్డ్స్, ఎత్తైన భారీ భవంతులు.. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తుంటే భిన్నంగా కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉండే గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు బాంబుల మోతలు, డ్రోన్ దాడుల భయం పౌరులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టైన చమురు క్షేత్రాలు, అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలనే లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబల్స్ దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల పరంపరలో కేవలం స్థానికులే కాకుండా వలసదారులు, విదేశీ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సౌదీ అరేబియా అనగానే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అరామ్ కో. ఈ సంస్థ నిర్వహిస్తున్న షాయ్బా ఆయిల్ ఫీల్డ్‌పైకి ఊహించని విధంగా ఒక డ్రోన్ దూసుకొచ్చింది. అయితే, సౌదీ భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఆ డ్రోన్‌ను గాల్లోనే అడ్డుకుని కూల్చివేశాయి. కానీ, ఆ డ్రోన్ పేలిపోయిన తర్వాత దాని శకలాలు కింద ఉన్న ఆయిల్ ఫీల్డ్ వర్కర్లపై పడటంతో ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ శకలాలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారు నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వలస కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఇక గాయపడిన వారిలో ఒకరు పాకిస్థాన్, మరొకరు మన భారతదేశానికి చెందినవారు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగానే.. సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం సాయంత్రం మరో భయంకరమైన దాడి జరిగింది. ఈ విషయాన్ని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరగడం సౌదీ ఇంటెలిజెన్స్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ దాడిలో ఒక సౌదీ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులు , సిబ్బందికి గాయాలయ్యాయని GACA తెలిపింది. గాయపడిన వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, క్షతగాత్రులను తక్షణ వైద్య చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. దాడి కారణంగా విమానాశ్రయంలో ఆస్తి నష్టం కూడా జరిగినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. దాడులు ఎక్కడి నుంచి, ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉండటంతో.. సౌదీలోని ఇండియన్ ఎంబసీ వెంటనే అప్రమత్తమై ఒక అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలకు గురికాకుండా స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో స్థానికంగా విధిస్తున్న కర్ఫ్యూలు, భద్రతాపరమైన ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ముఖ్యంగా నిరసనలు జరిగే ప్రాంతాలకు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు, రద్దీగా ఉండే మార్కెట్లకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న, పని చేస్తున్న, పర్యాటకులుగా వెళ్లిన భారతీయులు తమ వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
ఒకవైపు మిడిల్ ఈస్ట్ దేశమైన సౌదీలో డ్రోన్ దాడులతో వణుకు పుడుతుంటే.. మరోవైపు యూరప్ లోని అత్యంత ప్రశాంతమైన దేశం ఫ్రాన్స్ ఇప్పుడు నిరసనల మంటల్లో కాలిపోతోంది. పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ , పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిస్థితులు క్షీణించడంపై ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా జరగనున్న భారీ నిరసనల నేపథ్యంలో దేశంలో కర్ఫ్యూలను పొడిగిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను, భద్రతా బలగాలను మోహరిస్తామని ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకార్ను స్వయంగా హామీ ఇచ్చారు. పరిస్థితి చేయిజారిపోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఫ్రాన్స్ లో ఉన్న భారతీయుల కోసం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత పౌరులకు సహాయం అందించేందుకు పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం, అలాగే మార్సెయిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి.



