సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు నో ఫ్లైట్స్..భారతీయులకు హై అలర్ట్
కామెంట్లు (0)

ఉపాధి కోసం లక్షలాది మంది మన భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న వార్తలు మన దేశంలో ఉన్న వాళ్ల కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో పరిస్థితులు గత కొద్ది రోజులుగా ఏ విధంగా మారిపోయాయో చూస్తూనే ఉన్నాం. హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో సౌదీ పౌర మౌలిక సదుపాయాలపై భయంకరమైన దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను, సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం మన విదేశీ వ్యవహారాల శాఖ, అలాగే సౌదీలోని ఇండియన్ ఎంబసీ ఒక కీలకమైన కొత్త అడ్వైజరీని జారీ చేసింది.
సౌదీ అరేబియా రాజధానిలోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎప్పుడూ ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటుంది. కానీ అక్టోబర్ 10న ఊహించని విధంగా ఈ ఎయిర్పోర్ట్పై జరిగిన క్షిపణి , డ్రోన్ దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో దురదృష్టవశాత్తూ ఒక భారతీయ జాతీయుడు అక్కడికక్కడే మరణించాడు. మరో 11 మంది భారతీయులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మన భారతీయుల ఆరోగ్య పరిస్థితిపై ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మన రాయబార కార్యాలయం నిరంతరం టచ్లో ఉంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది. మరణించిన వ్యక్తి భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.హౌతీ తిరుగుబాటుదారులు దాడులు తీవ్రం చేసిన నేపథ్యంలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది. ప్రధానంగా కొన్ని కఠినమైన రూల్స్ పాస్ చేసింది. వైమానిక దాడులు జరుగుతున్న సమయంలో లేదా సైరన్లు మోగుతున్నప్పుడు ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను మాత్రమే తూచా తప్పకుండా పాటించాలి. ఎప్పటికప్పుడు లోకల్ న్యూస్, అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఫాలో అవ్వాలి. అత్యంత ముఖ్యమైనది మన వాళ్లకు ఏదైనా చిన్న ఘటన జరిగితే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం అలవాటు. కానీ ఇప్పుడు సౌదీలో జరుగుతున్న దాడులకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, ఫోటోలు లేదా ఫేక్ వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయకూడదని ఎంబసీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా స్థానిక చట్టాల ప్రకారం ఇది పెద్ద నేరం. కాబట్టి ఇలాంటి పనులు చేసి అనవసరంగా జైలు పాలవ్వొద్దని సూచించింది.



