అత్యద్భుత స్థాయిలో రామాయణం కొత్త ట్రైలర్..!
కామెంట్లు (0)

భారతీయ సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. మన పురాణాలను, మన ఇతిహాసాలను హాలీవుడ్ రేంజ్ విజువల్స్తో చూడాలని ప్రతి భారతీయుడు కలలు కంటుంటాడు. ఆ కలను నిజం చేసే దిశగా, మన రామాయణాన్ని ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టేందుకు బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ను తాజాగా బెంగళూరు వేదికగా మేకర్స్ చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే మాట వినిపిస్తోంది.. భారతీయ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొత్త శిఖరాలను అధిరోహించబోతోంది అని. ఒకవైపు శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ దివ్యరూపం, మరోవైపు లంకేశ్వరుడిగా రాకింగ్ స్టార్ యశ్ రౌద్రరూపం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
గతంలో ఆదిపురుష్ సినిమా చూసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ , కార్టూన్ లాంటి గ్రాఫిక్స్ చూసి ప్రేక్షకులు ఎంతగా డిజప్పాయింట్ అయ్యారో మనందరికీ తెలుసు. దానికి పూర్తి భిన్నంగా, ఒక రియలస్టిక్ ఫాంటసీ ప్రపంచాన్ని నితేశ్ తివారీ ఈ సినిమాలో సృష్టించాడు. రామాయణం ట్రైలర్లో చూపించిన భారీ యుద్ధాలు, అద్భుతమైన అయోధ్య లోకాలు, లంకాదహనం సీన్స్, భీకరమైన రాక్షస సైన్యాలు ప్రేక్షకులను అమాంతం త్రేతాయుగంలోకి, మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నది ప్రపంచంలోనే టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ అయిన DNEG సంస్థ. ఈ సంస్థ గతంలో ఇన్సెప్షన్, డ్యూన్, ఇంటర్స్టెల్లార్ లాంటి ఎన్నో హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ సినిమాలకు పని చేసింది. ఇప్పుడు వాళ్లు మన రామాయణానికి పని చేస్తుండటంతో.. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా హాలీవుడ్ స్థాయి ఫాంటసీ సినిమాలను గుర్తుచేస్తున్నాయి.
ట్రైలర్లో ప్రధానంగా ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం డిజైన్, శ్రీరాముడి బాణాల పవర్, వానర సైన్యం డీటైలింగ్, రావణుడి రౌద్రరూపం. అయితే నెట్టింట కొందరు నెటిజన్లు కొన్ని విజువల్స్లో ఉన్న CGI సహజత్వంపై చిన్న చిన్న సందేహాలు, విమర్శలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఓవరాల్గా ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం దీని కాస్టింగ్. ఏ భాష వాళ్లకి డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా మేకర్స్ పక్కా ప్లాన్ చేసుకున్నారు. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి, లంకేశ్వరుడిగా రాకింగ్ స్టార్ యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయ స్వామిగా బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తుండగా, ఇంద్రదేవుడిగా కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.



