కోల్కతాలో తొక్కిసలాట అసలక్కడ ఏం జరిగింది?
కామెంట్లు (0)

దసరా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో జరిగే దుర్గా పూజ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రముఖ దుర్గా పూజ మండపమైన చోర్బగాన్ వద్ద ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కోల్కతాలో ప్రతి ఏటా కొన్ని వందల సంఖ్యలో భారీ దుర్గా మండపాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో కొన్ని పండల్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడికి భారీ సంఖ్యలో పోటెత్తుతారు. ప్రమాదం జరిగిన ఈ మండపం వద్ద కూడా సరిగ్గా ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ఈ మండపం డిజైన్ వైరల్ కావడం, అందులోనూ శనివారం మహా సప్తమి కావడంతో ఊహించిన దానికంటే ఐదారు రెట్లు ఎక్కువ జనం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో భారీ వర్షం మొదలైంది. బయటమండపంలోకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారి రెండూ ఇరుకుగా ఉండటంతో లోపల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడిన జనం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. అదే సమయంలో వీఐపీ గేటు తెరిచారన్న ప్రచారంతో.. వెనక ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం ప్రారంభించారు. ఈ భారీ జనసందోహం ఒత్తిడికి అక్కడున్న వెదురు బారికేడ్లు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో బ్యాలెన్స్ తప్పి ముందున్న వారు కింద పడిపోవడం, వారి మీదుగానే వెనక ఉన్న వేలాది మంది జనం నడుచుకుంటూ వెళ్లడంతో ఈ ఘోరమైన తొక్కిసలాట చోటుచేసుకుంది.
ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు స్థానిక యంత్రాంగం వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. మేము లోపలికి వెళ్లడానికి క్యూలో నిలబడి ఉన్నాం. వెనక నుంచి అకస్మాత్తుగా ఒక పెద్ద అల లాగా జనం మా మీదకు వచ్చి పడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మేమంతా కింద పడిపోయాం అని ఒక మహిళ కన్నీరుమున్నీరయ్యారు. కింద పడిపోయిన వారిని తొక్కేసుకుంటూ జనం ముందుకు వెళ్లారని, ఆ సమయంలో పిల్లల, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయని సాక్షులు చెబుతున్నారు. ఊపిరి ఆడలేదు.. ఎవరైనా కాపాడండని అరుస్తున్నా వినిపించుకునే స్థితిలో ఎవరూ లేరు. ఎవరి ప్రాణాలు వాళ్లు కాపాడుకోవడానికే ప్రయత్నించారు. పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వారు కూడా ఆ జన ప్రవాహాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయారుఅని అక్కడే ఉన్న ఒక వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక వదంతులు , అధికారుల సమన్వయ లోపం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని సాక్షులు స్పష్టం చేస్తున్నారు.


