దావూద్ అక్కడే ఉన్నాడు..యూ.ఎన్ రిపోర్ట్ పై మండిపడిన భారత్ ..పాక్ వెన్నులో వణుకు!

భారత దౌత్య వర్గాలు విదేశీ గడ్డపై మన సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి భారత దౌత్య వర్గాలు తమ విశ్వరూపం చూపించాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎలా స్వర్గధామంగా మారిందో, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు ఎలా ఆశ్రయం ఇస్తోందో ప్రపంచానికి గుర్తు చేసింది మన భారతదేశం. అయితే ఈసారి భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది పాకిస్థాన్ పైన మాత్రమే కాదు.. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధి పైన. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఒక తప్పుడు రిపోర్టును సమర్పించినందుకు యూ.ఎన్ ప్రతినిధిపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్యసమితి... కౌంటర్ టెర్రరిజం పై ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ జనరల్ అసెంబ్లీలో సమర్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన బాధ్యతను, గ్లోబల్ టెర్రర్ నెట్ వర్క్ లను నిర్మూలించాల్సిన పద్ధతులను గుర్తుచేయాల్సిన ఈ రిపోర్ట్ లో.. బెన్ సాల్ పరోక్షంగా భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. మన దేశానికి అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం గురించి ఈ నివేదికలో ప్రస్తావిస్తూ.. దావూద్ ఇబ్రహీంను , అతని డీ-కంపెనీని ఇండియన బేస్డ్ క్రిమినల్ గ్యాంగ్ గా అందులో మెన్షన్ చేశారు. ఈ ఒక్క మాట పై భారత దౌత్య వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం దుబాయ్ మీదుగా పాకిస్థాన్ పారిపోయాడు. అక్కడ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ , పాక్ ఆర్మీ పూర్తి రక్షణ మధ్య కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన బంగ్లాలో దశాబ్దాలుగా తలదాచుకుంటూ, అక్కడి నుంచే తన మాఫియా నెట్ వర్క్ నడుపుతున్నాడు. ఇలాంటి ఒక కరడుగట్టిన ఉగ్రవాది, వందలాది మంది అమాయక భారతీయుల ప్రాణాలు తీసిన వ్యక్తి, దశాబ్దాలుగా పాకిస్థాన్ లో తలదాచుకుంటూ పాక్ ఆండతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఒక మాఫియా డాన్ ను.. ఇండియా బేస్డ్ గ్యాంగ్ లీడర్ గా ఐరాస ప్రతినిధి తన అఫీషియల్ రిపోర్ట్ లో పేర్కొనడంపై భారతదేశం తీవ్రంగా మండిపడింది. ఒక అంతర్జాతీయ సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పక్షపాతపూరితమైన, కనీస ఆధారాలు, చారిత్రక సత్యాలు లేని తప్పుడు నివేదికలు ఇవ్వడం ఏంటని సూటిగా నిలదీసింది. ఈ నివేదికపై యూ.ఎన్ లో ఉన్న భారత దౌత్యవేత్త రఘూ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యూ.ఎన్ ప్రతినిధి బెన్ సాల్ సమర్పించిన నివేదికపై మండిపడ్డారు. అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం భారతదేశంలో లేడు, పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వమే అతనికి అధికారికంగా ఆశ్రయం కల్పించింది. మాకు ఇస్తున్న నివేదికల్లో అతన్ని ఇండియా బేస్డ్ అని రాయడం మానుకోండి అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఇదే పాకిస్థాన్ గతంలో గ్లోబల్ టెర్రరిస్ట్, అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో అసలు లేనే లేడని ఎన్నో ఏళ్ల పాటు బుకాయించిందని గుర్తుచేశారు. అయితే చివరికి 2011లో అమెరికా నావీ సీల్స్ దళాలు బిన్ లాడెన్ ను హతమార్చిన ఉదంతాన్ని గుర్తుచేశారు. ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, వాళ్లు తమ దగ్గర లేరని అబద్ధాలు చెప్పడం పాకిస్థాన్ కు వెన్నతో పెట్టిన విద్య అని, లాడెన్ లాగే దావూద్ ఇబ్రహీం కూడా పాక్ లోనే భద్రంగా ఉన్నాడని ఆయన యూ.ఎన్ వేదికగా తేల్చి చెప్పారు. ఈ దెబ్బతో పాకిస్థాన్ గుట్టు రట్టు కావడమే కాకుండా, ఐరాస అధికారులకు కూడా ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఈ కౌంటర్ టెర్రరిజం రిపోర్ట్ లో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ, యూ.ఎన్ ఉన్నత ప్రమాణాలతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత దౌత్యవేత్త రఘూ పూరీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి. కానీ ఇలా బాధితులైన దేశాలపైనే బురద చల్లే ప్రయత్నం చేయడం ఐక్యరాజ్యసమితి ప్రతిష్టకే మచ్చ తెస్తుందని భారత్ హెచ్చరించింది. దావూద్ ఇబ్రహీం కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా గ్లోబల్ డ్రగ్ సిండికేట్ కు, మనీ లాండరింగ్ కు, అంతర్జాతీయ భద్రతకు కూడా అతిపెద్ద ముప్పు అని భారత్ స్పష్టం చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, భారతదేశ కేంద్రంగా పనిచేస్తున్న నేరస్థుడు అని నివేదికలో రాసి ఉగ్రవాదులకు వెనకేసుకురావడం ఏమాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది.



