భారతీయ పత్తికి తిరుగులేని బ్రాండ్ ఇమేజ్..రైతులకు అందనున్న అంతర్జాతీయ స్థాయి ప్రీమియం ధర

భారత్ ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఎప్పటినుంచో అగ్రగామిగా ఉంటోంది. ఇక్కడ పండే పత్తికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది. కానీ, దశాబ్దాలుగా మనకు ఒక అతిపెద్ద లోటు ఎక్కడో పుట్టిన ఈజిప్షియన్ కాటన్ కు, అమెరికాలో పండే సుపీమా కాటన్ కు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న బ్రాండ్ ఇమేజ్, వాళ్ల పత్తికి దొరికే ప్రీమియం ధర.. మన భారతీయ పత్తికి ఎప్పుడూ దక్కలేదు. మన రైతులు ఎంత కష్టపడి నాణ్యమైన పత్తి పండించినా, దానికి ఒక గ్లోబల్ గుర్తింపు లేకపోవడం వల్ల దళారుల చేతిలో మోసపోతూ సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ దుస్థితి మారబోతోంది. ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించి, భారతీయ పత్తికి అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టింది. అదే కస్తూరి కాటన్ భారత్.
కస్తూరి కాటన్ అనేది మన రైతులు పండించిన పత్తికి, దాని అద్భుతమైన నాణ్యతను బట్టి కేంద్ర ప్రభుత్వం , అంతర్జాతీయ సంస్థలు కలిసి ఇచ్చే ఒక ప్రీమియం బ్రాండ్, సర్టిఫికేషన్. మరి ఈ సర్టిఫికేషన్ మన పత్తికి రావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. సాధారణంగా రైతులు పండించే పొడవైన పింజ కలిగిన పత్తి .. అంటే సుమారు 28 మిల్లీమీటర్ల నుంచి 30 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న నాణ్యమైన పత్తి మాత్రమే ఈ కస్తూరి కాటన్ సర్టిఫికేషన్ కు ఎంపికవుతుంది. రైతులు పత్తిని ఏరే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్తిలో ఆకులు, చెత్తాచెదారం, మట్టి లేకుండా స్వచ్ఛంగా, తెల్లగా మెరిసిపోయేలా ఉండాలి. పత్తిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండాలి, ఇక వ్యర్థాలు చూసుకుంటే 1.5 శాతం నుంచి 2 శాతం లోపు మాత్రమే ఉండాలి. ఇలాంటి అత్యంత స్వచ్ఛమైన పత్తిని రైతులు మార్కెట్ కి తీసుకొచ్చినప్పుడు, అది జిన్నింగ్ మిల్లులకు చేరిన తర్వాత, NABL గుర్తింపు పొందిన అత్యున్నత స్థాయి ల్యాబ్స్ లో కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాస్ అయితేనే ఆ పత్తి బేళ్లకు కస్తూరి కాటన్ భారత్ సర్టిఫికేషన్‌ను ఇస్తారు. ఇలాంటి కస్తూరి కాటన్ తో తయారు చేసిన వస్త్రాలకు విపరీతమైన మృదుత్వం, ఎక్కువ కాలం మన్నిక, సహజమైన కాంతి, అధిక బలం చేకూరుతాయి.
ఈ కస్తూరి కాటన్ ప్రాజెక్టులో వ్యవసాయంతో పాటు సాంకేతికతను కూడా అద్భుతంగా జోడించారు. ఇందులో అత్యంత కీలకమైన ఫీచర్ ఏంటంటే..ట్రేసబిలిటీ . అంటే ఒక వస్తువు ఎక్కడ పుట్టింది, ఎక్కడికి ప్రయాణించింది అని ట్రాక్ చేయడం. దీనికోసం అత్యాధునిక బ్లాక్‌చెయిన్ సాంకేతికతను , క్యూఆర్ కోడ్ విధానాన్ని వాడుతున్నారు. ఉదాహరణకు ఒక పత్తి రైతు తన పంటను అమ్మాడు అనుకుందాం. ఆ పత్తి ఏ రాష్ట్రంలో, ఏ ఊర్లో, ఏ రైతు పొలంలో పండింది? అక్కడి నుంచి ప్రాసెసింగ్ కోసం ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్ళింది? దాన్ని దారంగా మార్చడానికి స్పిన్నింగ్ ఎక్కడ జరిగింది? ఫైనల్ గా ఆ దారంతో ఒక ఖరీదైన షర్ట్ లేదా వస్త్రం ఏ ఫ్యాక్టరీలో తయారైంది? ఇలా పత్తి విత్తనం భూమిలో పడిన దగ్గరి నుంచి షోరూంలో నేత వస్త్రం అయ్యే వరకు.. జరిగే ప్రతి అంచెను ఆన్లైన్ బ్లాక్‌చెయిన్ నెట్వర్క్ లో పారదర్శకంగా నమోదు చేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే.. రేపు అమెరికాలోనో, యూరప్ లోనో ఒక కస్టమర్ లేదా ఇంటర్నేషనల్ బయ్యర్ ఒక కాటన్ షర్ట్ కొని, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను తన స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు.. ఆ పత్తి ఇండియాలోని ఫలానా ఊర్లో పండింది, ఇది 100 శాతం ప్యూర్ ఇండియన్ కాటన్ అని సెకన్లలో తెలిసిపోతుంది. బ్లాక్‌చెయిన్ కాబట్టి ఈ డేటాను ఏ దళారీ, ఏ మధ్యవర్తి హ్యాక్ చేయలేరు, తారుమారు చేయలేరు. నకిలీ కాటన్ ను అసలైన కాటన్ గా అమ్మడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
ఇలా పారదర్శకత ఉండటం వల్ల విదేశీ కొనుగోలుదారులకు మన భారతీయ పత్తిపై పూర్తి నమ్మకం పెరుగుతుంది. వాళ్లు అడిగినంత రేటు, ప్రీమియం ధర ఇచ్చి మరీ మన కస్తూరి కాటన్ ను కొనుగోలు చేస్తారు. ఆ అదనపు లాభం నేరుగా జిన్నింగ్ మిల్లుల ద్వారా నాణ్యమైన పంట పండించిన రైతులకు చేరుతుంది. ఇక గణాంకాల పరంగా చూసుకుంటే, ఈ బ్రాండింగ్ చాలా వేగంగా ఊపందుకుంటోంది. 2023 నుంచి 24 మార్కెటింగ్ సీజన్లో సర్టిఫై అయిన కస్తూరి కాటన్ పత్తి కేవలం 47వుల 100 బేళ్లు మాత్రమే ఉండగా.. 2025 నుంచి 26 సీజన్ ముగిసేనాటికి అది ఏకంగా 2 లక్షల 13వేల బేళ్లకు చేరి రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా బేళ్లను బ్లాక్‌చెయిన్ వ్యవస్థ పరిధిలోకి విజయవంతంగా తీసుకొచ్చారు. భారత ప్రభుత్వం దీన్ని ఇక్కడితో ఆపడం లేదు. 2031 నుంచి 32 నాటికి దేశంలో అంచనా వేస్తున్న మొత్తం 498 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తిలో, సుమారు 132 లక్షల బేళ్లు ఈ కస్తూరి కాటన్ ప్రమాణాలను అందుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. నాణ్యమైన ముడిసరుకు మిల్లులకు వెళ్లడం వల్ల దారం తెగిపోవడం, వ్యర్థాలు రావడం లాంటి నష్టాలు తగ్గిపోయి వస్త్ర పరిశ్రమ కూడా అద్భుతంగా లాభాల బాట పడుతుంది.



