సేనాని పంతం నెగ్గించుకున్నారా?...మరోసారి తగ్గారా..?
కామెంట్లు (0)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేళయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం, జనసేన, బీజేపీ), ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ త్యాగాలను గుర్తుచేస్తూ సముచిత స్థానం దక్కాలని ఆశించిన జనసేన పార్టీకి, ఈ సీట్ల పంపిణీ అనుకున్న స్థాయిలో సంతృప్తినిచ్చిందా? అంటే సోషల్ మీడియాలో జనసైనికులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు అభిమానులు సేనాని నిర్ణయం ఏదైనా శిరోధార్యం అంటున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 17 అందులో టీడీపీ 11 స్థానాల్లో పోటీచేస్తోంది. విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. ఇక మిత్రపక్షం జనసేన 4 స్థానాల్లో బరిలో నిలిచింది. అందులో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ ఉన్నాయి. ఇక కూటమిలోని మరొక మిత్రపక్షం బీజేపీ 2 చోట్ల బరిలో నిలిచింది. అందులో రాజమహేంద్రవరం, అనంతపురం ఉన్నాయి. ఇక మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో మొత్తం 106 కాగా, టీడీపీ: 78 స్థానాలు. జనసేన 21 స్థానాలలో బీజేపీ 7 స్థానాలలో నిలిచింది. అయితే ఈ ఎపిసోడ్ లో కీలకంగా కనిపిస్తోంది. జనసేన పార్టీ పెట్టిన ప్రతిపాదనలు…మరి ఆ ప్రతిపాదనలకు తగినట్లు సీట్ల కేటాయింపు జరిగిందా అన్నది. ముందునుండి అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో తాము చేసిన త్యాగాలకు కచ్చితంగా స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం ఉండాలని జనసేన చెబుతూ వస్తోంది. అనేక సందర్భాల్లో జనసేన అధినాయకత్వం కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. అయితే తాజాగా సీటు షేర్ లో ఏ విషయం స్పష్టమవుతుందనేది చూసుకుంటే
రాష్ట్రంలో అత్యంత కీలకమైన విజయవాడ మేయర్ స్థానంతో పాటు కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం వంటి 4 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లను జనసేన సాధించుకుంది. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ సీట్లపై జనసేన మొదటి నుంచి తీవ్రమైన పట్టుబట్టగా, చంద్రబాబు వాటిని జనసేనకు వదిలేయక తప్పలేదు. అయితే మిగిలిన కొన్ని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం ఉన్నప్పటికీ సీట్లు ఎందుకు దక్కించుకోలేదన్నదే జనసైనికులు కూడా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశానిదే పైచేయి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2,091 పదవులకు ప్రతిపాదన.. 40.1% వాటా దక్కుతుందని సాక్ష్యాత్తూ జనసేన కీలక నేతలే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయగా…తీరా అధికారిక ప్రకటన మాత్రం జనసేన శ్రేణులను ఉసూరుమనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో గట్టి వ్యతిరేకతే కనిపిస్తోంది. సరే ఇప్పటికి పరిస్థితులు ఇలా ఉన్నా మరి ఓటింగ్ ఎలా ఉండనుంది అనేదే అసలు ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గి కూడా 100 శాతం స్ట్రైక్ రేట్ తో సంచలనం సృష్టించిన జనసేన మరోసారి అలాంటి ఫలితాలనే స్థానిక ఎన్నికల్లో చూస్తుందా? లేక స్థానిక పోరులో పోటీచేయలేక నిరుత్సాహంతో ఉన్న శ్రేణులు ఇచ్చే ఫలితాలతో షాక్ తింటుందా అనేది చూడాలి. ఏదేమైనా మరోసారి పవన్ తగ్గి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వెళ్ళుతున్నాడని వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే మిగతా వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఒకింత తన పట్టు నెగ్గించుకున్నప్పటికీ మరోవైపు స్పష్టంగా తగ్గినట్లే కనిపిస్తున్నారు. ఇక ఏ మాత్రం స్థానిక సమరంలో ప్రభావం చూపుతారనే దానిపై ఆ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు కూటమిలో పైకి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా కొన్ని అసంతృప్తులకు, మదనానికి దారితీసిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాలు, వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మరోసారి రాజీపడ్డారనే వాదన ఒకవైపు వినిపిస్తుంటే, క్షేత్రస్థాయి శ్రేణుల ఆశలు అడియాసలయ్యాయనే అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ, కేటాయించిన స్థానాల్లో జనసేన పార్టీ తన సత్తా చాటి, అసెంబ్లీ ఎన్నికల నాటి '100 శాతం స్ట్రైక్ రేట్' మ్యాజిక్ను మరోసారి రిపీట్ చేస్తుందా? లేక నిరుత్సాహపడిన శ్రేణుల ప్రభావం ఫలితాలపై పడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. ఈ స్థానిక సమరం ఫలితాలే రాబోయే రోజుల్లో జనసేన రాజకీయ భవిష్యత్తును మరియు కూటమిలో ఆ పార్టీ బలాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.



