స్థానిక పోరు.. రణరంగ రాజకీయం: ఈ ఘర్షణలు భవిష్యత్ తరాలకు ఇచ్చే సందేశమేంటి?
కామెంట్లు (0)

స్థానిక పోరు అనగానే ఎందుకు ఈ స్థాయిలో ఇలాంటి హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకోవడం..ప్రజలందరూ పాల్గొనాల్సిన ప్రజాస్వామ్య ఓట్ల పండుగగా చూడాల్సిన ఇటువంటి సందర్భాల్లో చోటు చేసుకునే ఘర్షణలు రేపటి తరాలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తాయి. వాళ్లు ఏం నేర్చుకుంటారు ఇటువంటి ఘటనలతో ఏం సందేశం ఇస్తున్నాం అనే వాదన ప్రజాస్వామ్య వాదుల నుండి వినిపిస్తోంది. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటన మరోసారి ఇటువంటిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదేమి ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. గత ప్రభుత్వాల సమయాల్లో కూడా ఈ విధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అసలు ఎన్నికలంటే కేవలం కొన్ని పార్టీలే తమ ఆస్తిలా భావిస్తున్నాయా? నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటి నుండే కక్ష పూరిత ధోరణితో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం లేదా వారికి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తె దాడులు చేయడం ఏమిటీ సంస్కృతి. కొత్త తరాలను కూడా అదే బాటలో నడపాలని చూస్తున్నారా? రాజకీయాలను ప్రభావవంతంగా, శాంతియుతంగా జరగకుండా చేస్తున్న ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఉపేక్షించకూడదు. ప్రజాస్వామ్యంపై కొత్త తరానికి నమ్మకం కలిగించే విధంగా సంబంధిత వర్గాలు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల నుండి వ్యక్తమవుతోంది. ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, ఓటు హక్కు సద్వినియోగానికి చిహ్నం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థాయి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొనే పండుగలా సాగాలి. కానీ, నేడు స్థానిక పోరు అనగానే వీధులు రణరంగంగా మారడం ఒకరిపై ఒకరు దాడులకు దిగడం సర్వసాధారణమైపోయింది. రాజకీయాన్ని సేవా దృక్పథంగా కాకుండా కేవలం అధికార సాధనకే మార్గంగా భావించే సంస్కృతి మూలంగానే ఎన్నికలు భయాందోళనల నడుమ సాగుతున్నాయి.



