ఏఐ విప్లవం: ఒకవైపు భారీ సంపద సృష్టి..మరో వైపు అప్‌స్కిల్లింగ్ తప్పదా?

Spread the love

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని రంగాల్లో కొన్ని ఉద్యోగాలు పోతుంటే మరోవైపు పెద్ద పెద్ద కంపెనీలు భారీగా సంపద పెంచుకుంటున్నాయి. ఏఐ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రావడంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితా కూడా పెరుగుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాంకేతికత తన రూపును వేగంగా మార్చుకుంటున్న విధానం చూస్తుంటే సామాన్య ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరి, నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయా? లేక కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయా?గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులు ఊహకందనట్లుగా ఉన్నాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, పెద్ద ఎత్తున కొన్ని రంగాల్లో  ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అదే సమయంలో, సరికొత్త రంగాల్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కూడా నివేదికలు చెబుతున్నాయి. అంటే నికరంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సమస్యల్లా ఏంటంటే, ఈ కొత్త ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి.అయితే ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ అంచనాల ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై తొమ్మిది శాతం మంది కార్మికులు రీ-స్కిల్లింగ్ లేదా అప్‌స్కిల్లింగ్ ను ఫేస్ చేయాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. కేవలం సాంకేతిక మార్పుల కారణంగానే కాకుండా, కంపెనీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాల వల్ల కూడా ఉపాధి రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఉద్యోగాల పరంగా సవాళ్లు ఉన్నా మరోవైపు కార్పొరేట్ ప్రపంచంలో మాత్రం సంపద పెరగడం కనిపిస్తోంది. గ్లోబల్ ప్రైవేట్ ఏఐ పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండటంతో కొన్ని సంస్థలు విపరీతంగా లాభాలను ఆర్జిస్తున్నాయి. అయితే ఈ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థలు ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటూ తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి టెక్ దిగ్గజాలు ఏఐ టెక్నాలజీలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్  భారీగా పెంచాయి. మొత్తానికి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక ముప్పు మాత్రమే కాదు, అది ఒక పెద్ద మార్పునకు నాంది. అపార అవకాశాలు కూడా సృష్టించనుంది.  దీనివల్ల కొన్ని రంగాల్లో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా, కొత్త రకాల ఉపాధి అవకాశాలు వచ్చే  అవకాశం ఉంది. ప్రభుత్వం, విద్యాసంస్థలు మరియు కార్పొరేట్ రంగాలు కలిసి యువతకు సరికొత్త నైపుణ్యాలలో శిక్షణ ఇస్తే ఏఐను పరిశ్రమ వర్గాలకు, అభివృద్ధికి మరింతగా వినియోగించుకోవడానికి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *