డేవిడ్ రెడ్డి సరసన ఉక్రెయిన్‌ భామ మరియ

Spread the love

టాలీవుడ్‌లో మరోసారి తనదైన శైలిలో బిజీగా మారిపోయారు మంచు మనోజ్. గత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, రీఎంట్రీ తర్వాత వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా’మిరాయ్’ సినిమా తరువాత మనోజ్ కెరీర్‌లో పెద్ద మార్పు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బ్లాక్ స్వోర్డ్ గా విలన్ గా చేసి, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం David Reddy. ఈ సినిమాకు దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి  దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ మోతుకూరి ఇంకా వెంకటరెడ్డి నల్లగంగుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, అలాగే ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కథలో యాక్షన్, ఎమోషన్ కలిపి ఒక కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నటి ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాలో ఉక్రెయిన్‌కు చెందిన నటి మరియ ర్యబోషాపక కథానాయికగా కనిపించనున్నారు. ఆమె ఈ సినిమాలో క్లారా అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. విడుదలైన పోస్టర్‌లో మరియా విదేశీ మహిళగా కనిపిస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌పై ఉన్న కాప్షన్ “ఆమె ప్రేమ యుద్ధం” ఈ పాత్ర కథలో ఎంత ముఖ్యమో చెప్తుంది. అందుకే ఈ పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరియాకు ఇది మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. అయితే దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఆమె కొత్త కాదు. ఇప్పటికే తమిళంలో ఒక సినిమాలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘ప్రిన్స్’  సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ నటించగా, దర్శకుడు అనుదీప్ కె.వి. ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. 2022లో విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మరియా అందం, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మంచి గుర్తింపు పొందాయి. తాజాగా ఇప్పుడు డేవిడ్ రెడ్డి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *