బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ ఈరోజు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా ఎదిగిందన్నారు. యూరప్ వెలుపల ఎయిర్ బస్ రెండవ అతిపెద్ద డిజిటల్ సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భారతదేశంలోని నైపుణ్యంతో కూడిన యువశక్తి ఆధారంగా రూపొందిన ఈ కొత్త ఎయిర్ బస్ క్యాంపస్ లో ఆధునిక ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా భారత్ GCC శక్తిగా ఎదుగుతున్న సామర్థ్యాన్ని మరింత బలంగా ప్రతిబింబిస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ప్రయాణించే ఎయిర్ బస్ కమర్షియల్ విమానాలు మరియు హెలికాప్టర్ల కోసం కీలక వ్యవస్థలను ఇండియన్ టాలెంట్ డిజైన్ చేసి అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.