టాలీవుడ్లో తన ఎనర్జీ, డాన్స్‌లు, యాక్షన్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని. యువ హీరోలలో తనదైన శైలితో అభిమానులను అలరిస్తూ వస్తున్న రామ్, కెరీర్లో పలు విజయవంతమైన సినిమాలు అందుకున్నారు. ముఖ్యంగా యూత్ మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తో ప్రేక్షకులను పలకరించిన ఆయన చేయబోయే తదుపరి సినిమా ఏంటని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తదుపరి సినిమా గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఒక వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథను యువ దర్శకుడు లోగి విగ్నేష్ చెప్పినట్లు సమాచారం. ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద పనిచేసిన శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఇక లోకేష్ కనగరాజ్ సినిమాలు ప్రత్యేకమైన కథా నిర్మాణం, స్టైలిష్ యాక్షన్, గట్టి స్క్రీన్‌ప్లేకు ప్రసిద్ధి. అందుకే ఆయన దగ్గర పనిచేసిన దర్శకులు కూడా కొత్త తరహా కథలతో ముందుకు వస్తారని చాలా మంది భావిస్తున్నారు. అదే విధంగా లోగి విఘ్నేశ్ కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసి రామ్‌కు వినిపించారని సమాచారం. ఆ కథ రామ్‌కు బాగా నచ్చడంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. అన్ని విషయాలు ఓకే అయిన తరువాత చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.