ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడు తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ రూపొందుతోంది. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడుగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక జయకృష్ణకు జోడీగా రవీనా టాండన్ కుమార్తె రష తడానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేసింది. ‘RX 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అటు ఘట్టమనేని అభిమానులు తమ అభిమాన కుటుంబం నుండి మరో హీరో వస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.