
Nandamuri Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) వారి గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య బాబును ఈ ఏడాది చేర్చారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 30న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా WBR సంస్థ విడుదల చేసిన ప్రకటనలో – “భారతీయ చలనచిత్ర రంగంలో ప్రధాన హీరోగా 50 ఏళ్లకుపైగా కొనసాగుతూ చేసిన అద్భుతమైన నటనకు, సినీ కళకు అందించిన సేవలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ అంకితభావం, ప్రతిభ, మరియు సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిన మీ స్థానం లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఇదే కాకుండా గత 15 ఏళ్లుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా మీరు సమాజానికి అందించిన సేవలు కూడా ప్రస్తావించదగినవే. ఈ ప్రతిష్ఠాత్మక గోల్డ్ ఎడిషన్‌లో మీ పేరును చేర్చినందుకు మేము గర్వంగా భావిస్తున్నాం” అని తెలిపారు.Nandamuri Balakrishna.
బాలకృష్ణ సినీ జీవితం 50 సంవత్సరాలకు పైగా సాగుతూ వస్తోంది. ఈ 50 ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆయన అనేక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే తండ్రి, ఎన్.టి.ఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటూ, విమర్శకుల ప్రశంసలు, జాతీయ స్థాయి అవార్డులు ఆయన్ని వరించాయి.
నటుడిగా మాత్రమే కాకుండా, సేవా రంగంలోనూ ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇటీవల విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఆయనకు ప్రతిష్ఠాత్మక నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ గౌరవంతో, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం దక్కించుకోవడం ద్వారా బాలకృష్ణ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. ఇది కేవలం ఆయనకు గౌరవమే కాదు, తెలుగు సినిమా గర్వించదగిన ఘనత అని చెప్పొచ్చు.