భారతీయ సినిమా మునెపెన్నడూ లేనంత క్రేజ్ తో రోజు రోజుకూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ దూసుకుపోతోంది. రానున్న భారీ చిత్రాలపై మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకవైపు పౌరాణిక ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న రామాయణ, మరోవైపు పురాణాల నేపథ్యంతో రూపొందుతున్న వారణాసి, అలాగే సైన్స్ ఫిక్షన్ పురాణ గాథను కలిపి రూపొందిస్తున్న కల్కి 2 సినిమాలు ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాల గురించి ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద బజ్ గా మారుతోంది. అలాంటి ప్రాజెక్ట్‌లలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతుండగా, హీరోయిన్‌గా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అలానే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇక మరో భారీ ప్రాజెక్టు ‘కల్కీ 2898 AD’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న’కల్కీ 2’. ఇందులో హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ విజయంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కల్కి 2 షూటింగ్ కొనసాగుతోంది. ఇక మరొక చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు, భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళిల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇలా ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో రూపొందుతున్నందున ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీల విషయానికి వస్తే రామాయణ మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుంది. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఉగాది కానుకగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కల్కి 2 సినిమా మాత్రం వచ్చే ఏడాది చివరలో లేదా 2028 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి చూస్తే ఈ మూడు సినిమాలు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లుగా నిలవబోతున్నాయి. అయితే ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకుల్లో అత్యధిక క్రేజ్ ఉన్నది వారణాసికే అని చెబుతున్నారు. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వం, మహేశ్ బాబు హీరోగా నటించడం అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.