మహేష్‌, పూరి మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నారా..?

Spread the love

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.. ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు కానీ.. మహేష్‌ నెక్ట్స్ మూవీ గురించి సోషల్ మీడియాలో డిష్కసన్ జరుగుతుంది. అయితే.. పూరితో మహేష్‌ సినిమా ఉంటుందా..? ఇప్పట్లో ఈ కాంబో మూవీ సాధ్యమేనా..? అనే చర్చ సినీ అభిమానుల్లో జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కదా.? మరి.. ఆ ప్రాజెక్ట్ ఏమైంది..? ఇద్దరి మధ్య గొడవ ఏమైనా అయ్యిందా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబును హీరోగా పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అదే.. రాజకుమారుడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. ఆతర్వాత
దర్శకేంద్రుడుతో మహేష్ మరో సినిమా చేయలేదు. అలాగే క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీతో మహేష్‌ బాబు మురారి అనే సినిమా చేయడం.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. అయితే.. కృష్ణవంశీతో కూడా మహేష్‌ మరో సినిమా చేయలేదు. ఇటీవల కృష్ణవంశీ మహేష్‌ బాబు ఉన్న రేంజ్ కి నేను సినిమా తీయలేనని చెప్పడం జరిగింది. ఇక గుణశేఖర్, శ్రీను వైట్ల, తేజ తదితరులు గతంలో మహేష్‌ తో సినిమా తీసినా ఇప్పుడు మహేష్‌ తో సినిమా చేయలేని పరిస్థితి.

మరి.. గతంలో మహేష్ తో సినిమా తీసిన దర్శకుల్లో ఎవరికి ఇప్పుడు కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందంటే పూరి జగన్నాథ్ అని టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన పోకిరి చిత్రాన్ని అందించారు పూరి జగన్నాథ్. అప్పటి వరకు మహేష్‌ కెరీర్ వేరు.. పోకిరి తర్వాత వేరు. మహేష్ లో ఉన్న మాస్ ను బయటకు తీసి అందరి చేత శభాష్ అనిపించేలా చేశారు. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించిన మహేష్‌.. ఆతర్వాత పూరితో బిజినెస్ మేన్ అంటూ మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

పోకిరి, బిజినెస్ మేన్ అంటూ మహేష్‌ బాబుతో రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన పూరి జగన్నాథ్ మహేష్ తో మూడో చిత్రంగా జనగనమణ అనే సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. కథ చెప్పడం.. నచ్చి సినిమా చేద్దామని మహేష్‌ మాట ఇవ్వడం జరిగింది. అయితే… మహేష్‌ ఎంతకీ డేట్స్ ఇవ్వకపోవడం.. ఎప్పుడు ఈ సినిమా చేద్దామో క్లారిటీగా చెప్పకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే విషయం గురించి పూరిని అడిగితే.. మహేష్‌ అభిమానులు మా హీరోతో సినిమా ఎప్పుడు అని అడుగుతుంటారు. ఆయన అభిమానులకు నా పై నమ్మకం ఉంది కానీ.. ఆయనకు నా పై నమ్మకం లేదని.. అలాగే ఫామ్ లో లేని డైరెక్టర్స్ తో మహేష్‌ సినిమా చేయడని పూరి చెప్పారు. ఆ విధంగా పూరి తన మనసులో మాటలను బయటపెట్టారు. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. ఈ కాంబో సెట్ కాదా అంటే సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే పూరి ఇప్పుడు బ్లాక్ బస్టర్ సాధిస్తే.. మళ్లీ మహేషే కాదు.. స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి రెడీనే. మరి.. పూరి నెక్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.