
OG Kannada Release: పవన్ కళ్యాణ్ చిత్రాలకు సగటు ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు విశేషమైన క్రేజ్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ‘ఓజీ’ సినిమాపై మాత్రం ఈసారి ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. కేవలం ప్రీ లుక్ విడుదలైన దశ నుంచే దర్శకుడు సుజీత్ భారీ హైప్‌ను క్రియేట్ చేయగలిగాడు. ఆ తర్వాత విడుదలైన గ్లింప్స్ టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్, పాటలతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ప్రస్తుతం ‘ఓజీ’ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా అభిమానుల కోరిక మేరకు మరో భాషలో విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే — కర్ణాటకలో పవన్ అభిమానులు కన్నడలోనూ ‘ఓజీ’ రిలీజ్ కావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినతులు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బెంగళూరులో జరిగిన ‘మిరాయ్’ సినిమా ప్రమోషన్ ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. హీరో తేజా సజ్జా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ‘ఓజీ.. ఓజీ’ అంటూ హడావుడి చేయడంతో, అక్కడి అభిమానుల ఉత్సాహం ఎంతటిదో స్పష్టమైంది. దానికి స్పందనగా తేజా సజ్జా “మిరాయ్ తర్వాత అందరం ఓజీకి వెళ్లాలి” అని కామెంట్ చేయడం మరింత వైరల్ అయింది.
ఈ నేపథ్యంలో, బెంగళూరులోని తెలుగు ప్రజలతో పాటు స్థానిక కన్నడ ప్రేక్షకుల్లోనూ ‘ఓజీ’ కోసం ఆసక్తి నెలకొనింది. ఈ డిమాండ్‌ను గుర్తించిన చిత్రబృందం, కన్నడ వెర్షన్‌ను కూడా విడుదల చేయాలనే దిశగా పనిచేస్తోంది. సమాచారం ప్రకారం, ప్రస్తుతం కన్నడ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న కన్నడ భాషలో కూడా సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. OG Kannada Release.
సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.