పవన్ కళ్యాణ్ ఫాన్స్ పవర్ స్టార్ సినిమాల కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో… అంతే ఈగర్ గా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ డెబ్యూ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు…అకిరా నందన్ ఎక్కడైనా కనిపించినా, ముఖ్యంగా అతని స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడల్లా ఈ చర్చ మరింత వేడెక్కుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అకిరా గురించి చాలా ఆసక్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు. “తండ్రి లాగే హీరోగా వస్తాడా?”, “లేదా తనకు ఇష్టమైన సంగీత రంగంలో కెరీర్ మొదలుపెడతాడా?” అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్వయంగా ఎలా ఆలోచిస్తున్నారు అనే అంశం గురించి తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందుగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హరీష్ శంకర్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి అనేక విషయాలు పంచుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో భాగంగానే అకిరా నందన్ గురించి ప్రశ్న రావడంతో హరీష్ శంకర్ తన అనుభవాన్ని వివరించారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ, “నేను కూడా ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు అకిరా గురించి ప్రస్తావించాను. ‘బాబును ఇలా లాంచ్ చేస్తే బాగుంటుంది’, ‘అలా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది’ అంటూ నా అభిప్రాయాన్ని చెప్పాను. కానీ ఆ విషయంపై పవన్ కళ్యాణ్ గారు మాత్రం అంతగా ఎగ్జైట్ కాలేదని తెలిపారు. ఇంకా ఆయన చెప్పిన మాటలు ప్రకారం, ఒక పిల్లవాడు జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో అతనే నిర్ణయించుకోవాలి. తండ్రిగా తన అభిప్రాయాన్ని బలవంతంగా పెట్టడం ఆయనకు ఇష్టం లేదని హరీష్ శంకర్ చెప్పారు. “అతనికి ఏం చేయాలనిపిస్తే అదే చేయనిస్తాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను హరీష్ శంకర్ గుర్తు చేశారు.
దీనిని బట్టి చూస్తే అకిరా నందన్ భవిష్యత్తు పూర్తిగా అతని స్వంత నిర్ణయంపైనే ఆధారపడి ఉందని చెప్పాలి. అతనికి నిజంగా నటన మీద ఆసక్తి ఉంటే, అప్పుడు మాత్రమే హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడతాడు. కేవలం అభిమానుల కోరికల కోసం గానీ, తండ్రి పేరు కోసం గానీ హీరో అవ్వాలని పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేయరని ఈ వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎంచుకున్నా, అది అతని స్వంత అభిరుచితోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ మాటల ద్వారా తెలుస్తోంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం… అతను ఎలాంటి రంగాన్ని ఎంచుకున్నా, అభిమానులు మాత్రం అతనికి ఎప్పుడూ అండగా నిలుస్తారనేది నిజం.