మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) వచ్చేస్తోంది…ఎన్నాళ్లుగానో మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ కి కీలకం. సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్స్ కాళీ గా ఉన్నాయ్. సో, ఇప్పుడు పెద్ది సినిమా హిట్ ఐతే మళ్లీ ఇండస్ట్రీ కి సరికొత్త జోష్ వస్తుంది. నెక్స్ట్ కూడా భారీ సినిమాలు రిలీజ్ ఉండడం తో మళ్ళి అందరు ట్రాక్ లో పడతారు. అలాగే పర్సెంటేజ్ విధానం పై కూడా గొడవ సర్దుమణగింది కాబట్టి, నో టెన్షన్! అలాగే పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచడానికి గవర్నమెంట్ కూడా GO విడుదల చేసింది!‘పెద్ది’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతల అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం.. ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ సినిమాలకు కూడా గతంలో ప్రత్యేక అనుమతులు లభించాయి. ఇప్పుడు అదే తరహాలో ‘పెద్ది’ చిత్రానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూన్ 3వ తేదీన సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ప్రత్యేక షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ.600 వరకు ఉండొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రీమియర్ షోలకు టాలీవుడ్ లో ఉండే ప్రత్యేకమైన క్రేజ్ గురించి తెలిసిందే. సినిమా విడుదలయ్యే జూన్ 4వ తేదీ నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా రూ.100 పెంచుకోవచ్చు. అలాగే మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.125 వరకు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయం నిర్మాతలకు పెద్ద ఊరటగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇలాంటి భారీ సినిమాలకు మొదటి వారం కలెక్షన్లు చాలా కీలకం. ముఖ్యంగా ఓపెనింగ్స్ బలంగా ఉంటేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు. అందుకే పెద్ద సినిమాల సమయంలో టికెట్ ధరల పెంపు నిర్మాతలకు అదనపు ఆదాయం తీసుకువస్తుంది. అలాగే ప్రభుత్వం మరో ముఖ్యమైన అనుమతిని కూడా ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.ప్రస్తుతం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు చూస్తుంటే విడుదలైన తొలి వారం థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాంచరణ్‌కు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.