రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మంథన హీరోయిన్ గా కనిపించనుంది. జయమ్మ పాత్రలో ఆమె కనిపించనున్నారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు అంతటా సంచలనం సృష్టిస్తోంది. 1854-1878 మధ్య జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆ కాలంలో బ్రిటిష్ వారు మన దేశంపై సాగించిన క్రూరమైన పాలనకు, స్థానిక ప్రజల ఆకలి కేకలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక వీరుడి కథ ఇది. బ్రిటిషర్ల ఆగడాలకు, సీమ జనాల ఆకలి కేకలకు వ్యతిరేకంగా పోరాడి తెల్లదొరల ఆగడాలపై కత్తి దూసి సమాధానమిచ్చిన రణబాలి సింహగర్జన అక్టోబర్ 16 నుంచి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ లైఫ్ టైమ్ చెప్పుకునే పాత్రను చేశారని సోషల్ మీడియాలో అభిమానులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇక టీజర్ లో బ్రిటిష్ వారు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అనే విధంగా తెరకెక్కించిన సన్నివేశాలు, భారతీయులు ఎదుర్కొన్న బాధలు హృదయాన్ని మెలిపెట్టే సన్నివేశాలతో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయక పాత్రలో అదరగొట్టారు. టీజర్‌లో ఆర్నాల్డ్ వోస్లూ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన హావభావాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఎంచుకున్న కథాంశం, తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను నేరుగా ఆ కాలంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ లో విజయ్ నటన టీజర్ లో హైలెట్ గా నిలిచింది. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ తిరిగి విజయాలను అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత శక్తివంతమైన, మైలురాయిలాంటి పాత్రగా నిలవనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.