నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల రూపకల్పన చూసిన అభిమానులు ఈ సినిమాను ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణంలోని పాత్రలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో ఈ సినిమా గురించి హీరో రణ్‌బీర్ కపూర్ చెప్పిన తాజా విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌బీర్ కపూర్ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో తాను కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాకుండా మరో ముఖ్యమైన పాత్ర అయిన ‘పరశురాముడి’గా కూడా కనిపించనున్నానని చెప్పారు. అంటే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే రామాయణ కథలో పరశురాముడు చాలా శక్తివంతమైన, ఆధ్యాత్మికతతో నిండిన పాత్రగా ఉంటుంది. రణ్‌బీర్ మాట్లాడుతూ, “శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఆరో అవతారం పరశురాముడు. అలాంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం నా జీవితంలో చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రను కూడా చేయడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం. ఈ పాత్రలు కేవలం ఒక నటన కాదు… అవి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటివి. ఆ పాత్రల వెనక ఉన్న భావోద్వేగాలను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైందని అన్నారు. ఈ పాత్రలకు పూర్తిగా న్యాయం చేయాలంటే ముందుగా వాటి గురించి లోతుగా తెలుసుకోవాలని ఆయన భావించారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దాదాపు ఒక సంవత్సరం పాటు రామాయణ కథ, శ్రీరాముడి వ్యక్తిత్వం, పరశురాముడి స్వభావం గురించి విస్తృతంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆ పాత్రల బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి ఆలోచనలు, ధర్మం, విలువలు అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ మరొక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించనుండగా, సీతా దేవిగా సౌత్ ఇండియన్ స్టార్ సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ కథను ఆధునిక అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ టీమ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీలపై కూడా స్పష్టత వచ్చింది. ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.