ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తాజాగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఇది పంజాబ్ కు వరుసగా రెండో విజయం. మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 73 (43; 6×4, 5×6) విధ్వంసకర ఇన్నింగ్స్ తో సత్తాచాటాడు. శివమ్ దూబే 45 (27; 5×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ 32 (12; 6×4, 1×6), గైక్వాడ్ 28 (22; 2×4) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ ముందు భారీ స్కోర్ ను ఉంచింది. ఇక పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైషాక్ కు 2 వికెట్లు, బార్ట్ లెట్, యెన్సన్, చాహల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో పంజాబ్ సత్తా చాటింది. ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 50 (29; 4×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 43 (34; 6×4, 1×6), ప్రియన్షు ఆర్య 39 (11; 3×4, 4×6), కూపర్ కన్నోలి 36 (22; 6×4) పరుగులు చేశారు. దీంతో పంజాబ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో మాట్ హెన్రీ, కాంబోజ్ లు రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ తో పంజాబ్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. టీ 20లలో ఎక్కువ సార్లు 200+ స్కోరును ఛేదించిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది.