చెర్రీ కన్నా ముందు కవల పిల్లల్ని కన్నది వీళ్ళే…

Spread the love

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బిగ్ హిట్ అందుకోవడంతో అభిమానులు అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు. ఇక జనవరి 31న  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించడం, అందులో మెగాస్టార్ ఎప్పటినుంచో కోరుకున్నట్టే ఒక మగపిల్లవాడు కూడా ఉండడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటికే చెర్రీ–ఉపాసన దంపతులకు ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్లిన్ కార కి ఒక తమ్ముడు, ఒక చెల్లి రావడంతో ఆ చిన్నారి కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది. మెగా కుటుంబంలో మరో కొత్త తరం అడుగుపెట్టిందని అభిమానులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఈ సందర్భంగా సినీ అభిమానులు గతంలో స్టార్స్‌కు పుట్టిన కవల పిల్లల విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికాకు మొదటగా 2011లోనే కవలలు జన్మించారు. వారి పేర్లు అరియానా, వివియానా. ఆ తర్వాత 2018లో ఓ అబ్బాయి, 2019లో ఓ అమ్మాయి పుట్టడంతో వారి కుటుంబం మరింత పెద్దదైంది. ఇక నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ – ప్రముఖ గాయని చిన్మయి దంపతులకు కూడా కవలలు పుట్టారు. వారి పేర్లు ద్రిప్తా, శర్వాస్. ఈ జంట తమ పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో పంచుకున్న క్షణాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు కూడా కవల పిల్లలు ఉన్నారు. అయితే వారు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కావడం విశేషం. అలాగే మన తెలుగు యాంకర్ ఉదయభాను కూడా తన మొదటి కాన్పులోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా తెరపై కూడా మెరిశారు. తండ్రి హీరోగా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమాలో ఓ పాటలో వీరిద్దరూ నర్తించడం అభిమానులను ఆకట్టుకుంది. దక్షిణాదికే పరిమితం కాకుండా ఉత్తరాదిలో కూడా పలువురు సెలబ్రిటీలకు కవల పిల్లలు ఉన్నారు. ముందుగా గుర్తొచ్చేది శత్రుఘ్న సిన్హా – పూనమ్ సిన్హా దంపతులు. వారికి లవ్, కుష్ అనే కవల కుమారులు ఉన్నారు. అందాల తార సోనాక్షి సిన్హాకు వీరిద్దరూ సొంత అన్నలు. సంజయ్ దత్ – మాన్యతా దంపతులకు షహ్రాన్, ఇక్రా అనే ట్విన్స్ ఉన్నారు. సన్నీ లియోన్ – డానియెల్ వెబర్‌కు కూడా కవల మగపిల్లలు పుట్టారు. ప్రీతి జింటా సరోగసీ ద్వారా 2021లో జై, జియా అనే కవలలను పొందింది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకపోయినా, 2017లో సరోగసీ ద్వారా యశ్, రూహి అనే కవలలకు తండ్రి అయ్యారు. అలాగే నటి సెలీనా జైట్లీ కూడా 2012లో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలు ట్విన్స్‌కు తల్లిదండ్రులుగా మారారు. ఇప్పుడు ఆ జాబితాలో రామ్ చరణ్ – ఉపాసన కూడా చేరడం మెగా అభిమానులకు గర్వకారణంగా మారింది. తమ మొదటి సంతానానికి ‘క్లీంకార’ అని అందమైన పేరు పెట్టిన ఈ దంపతులు, ఇప్పుడు ఈ కవలలకు ఎలాంటి పేర్లు పెడతారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఏది ఏమైనా… ఈ కవలల రాకతో తాత చిరంజీవికి, తండ్రి రామ్ చరణ్‌కు అమితానందం దక్కింది. మెగా కుటుంబంలో ఈ ఆనందం ఎప్పటికి నిలిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.