నాలుగేళ్ల క్రితం వరకు రిషబ్ శెట్టి అనే పేరు కర్ణాటక బయట ఉన్న సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడిగా, నటుడిగా కన్నడలో కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ, ఆయన క్రేజ్ మాత్రం ఎక్కువగా కన్నడ ప్రేక్షకులకే పరిమితమై ఉండేది. కానీ 2022లో వచ్చిన ‘కాంతారా’ సినిమా రిషబ్ శెట్టి జీవితాన్నే కాదు… దక్షిణాది సినిమాల ప్రయాణాన్నే ఒక మలుపు తిప్పింది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, తానే హీరోగా నటించిన కాంతారా మొదట కన్నడలో విడుదలై రెండు వారాలకే సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో, హిందీలో, తమిళంలో డబ్ అయి విడుదలయ్యాక… పాన్ ఇండియా హిట్ గా మారి, ఒక్కసారి అందరిని కన్నడ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది… అందుకే అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్‌లో ఆయనకు వచ్చిన గుర్తింపు మాటల్లో చెప్పలేనిది…ఈ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది ‘కాంతారా చాప్టర్ 1’. గత ఏడాది దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. కథ, విజువల్స్, సంగీతం, రిషబ్ నటన అన్ని కలిసి ప్రేక్షకులను మరోసారి కట్టిపడేశాయి. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిందని ప్రచారం జరిగింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశమంతా మార్మోగిపోయింది, ఆయన మార్కెట్ మరింత విస్తరించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. తెలుగులో జై హనుమాన్ సినిమాలో నటించడానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా కమిట్ అయ్యారు. రిషబ్ శెట్టి చేయబోయే రాబోయే సినిమాలు అధికారికంగా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత భారీ బజ్ క్రియేట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే… కన్నడ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రిషబ్ శెట్టి ప్రయాణం ఇప్పటికీ కొత్త మైలురాళ్ల కోసం ముందుకు సాగుతూనే ఉంది.