ధురంధర్ రికార్డుల వేట మొదలెట్టేసినట్లేనా??? 

Spread the love

ధురంధర్ 2 రేపు విడుదలకు రెడీ అయింది. ఈ సీక్వెల్ తో  మరో భారీ బాక్సాఫీస్ తుపాను రాబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్ వీర్ సింగ్  హీరోగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్  2’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాతే రికార్డులు మొదలవుతాయి, కానీ ఈ మూవీ మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ స్టేజ్ నుంచే కొత్త చరిత్ర రాస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో కనిపిస్తున్న అసాధారణమైన క్రేజ్ ఇప్పుడు థియేటర్లను కూడా కొత్త నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా ముంబైలోని ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్‌లో జరిగిన మార్పు ఈ హైప్‌కు పెద్ద ఉదాహరణగా చెప్పాలి. దశాబ్దాలుగా అక్కడ రోజు స్క్రీన్ అవుతున్న ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’  షో టైమింగ్‌ను మార్చాల్సి రావడం నిజంగా సంచలనమే. ఇప్పటి వరకు ప్రతిరోజూ ఉదయం 11:30 గంటలకు ప్రదర్శితమవుతూ వచ్చిన ఈ క్లాసిక్ మూవీని, ఇప్పుడు ఉదయం 10 గంటలకు షిఫ్ట్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాల చరిత్రలో ఇదే మొదటిసారి ఈ షో టైమ్ మారడం విశేషం. ఈ నిర్ణయం వెనుక కారణం ఒక్కటే—‘ధురంధర్ 2’కి ఉన్న డిమాండ్. ఈ సినిమాకు దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివి ఉండటం కూడా థియేటర్లకు సవాలుగా మారింది. షోలను సర్దుబాటు చేయడానికి ప్రత్యేక ప్లానింగ్ చేయాల్సి వస్తోంది. మరాఠా మందిర్‌లో ఈ సినిమాను మధ్యాహ్నం 1:15, సాయంత్రం 5:30, రాత్రి 9:45 గంటలకు ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా చాలా థియేటర్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు కూడా ప్లాన్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ రికార్డుల విషయానికి వస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఈ ట్రెండ్‌ను చూస్తుంటే, మొదటి రోజు కలెక్షన్లలో షారుఖ్ ఖాన్  నటించిన ‘జవాన్ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే ఒక భారీ ప్రభంజనం సృస్టించనుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *