మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని బీ.ఆర్.ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీనిపై ఆందోళన చేపట్టారు. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుండి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎంట్రీ పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. ఇదేమి రాజ్యం.. పోలీస్ రాజ్యం అంటూ అసెంబ్లీ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరు నశించాలంటూ నినాదాలు చేస్తూనే బీఆర్ఎస్ నేతలు సభలోకి వెళ్లారు.