వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు. భావోద్వేగాల ప్రవాహంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడిగా శ్రీ విష్ణు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రయాణం టాలీవుడ్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంది. ఒక సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గతంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఓం భీమ్ బుష్ మరియు స్వాగ్ లాంటి సినిమాలు ఆయనలోని వైవిధ్యాన్ని మరోసారి బయటపెట్టాయి. ఆ తర్వాత వచ్చిన సింగిల్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించి, ఆయన జోరును మరింత పెంచింది. కేవలం మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా, కథాబలమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ విడుదలైంది.
మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తోంది. జానకిరాం మారెల్ల దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ విడుదలైంది. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో 1992లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. రాధికా శరత్ కుమార్, సత్య, సాయిచంద్, షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. టీజర్‌ను గమనిస్తే, సామాజిక అంశాలు, విప్లవ భావాలు, రాజకీయ పోరాటాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు స్పష్టమవుతోంది. శ్రీవిష్ణు తనదైన అభినయంతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యారు. శ్రీవిష్ణు మరియు సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. విప్లవ భావజాలం ఉన్న యువకుడిగా ఆయన చెప్పే సంభాషణలు, చేసే పోరాటాలు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ కు మరో హైలెట్ గా నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ తొమ్మిదవ తేదీన దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తోనే అంచనాలు భారీగా పెంచేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.