వినోదాత్మక సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. మున్నా, బృందావనం, ఊపిరి, మహర్షి, వారసుడు వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. యాక్షన్ హీరోగా సల్మాన్ ఖాన్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో ఆయన చూపించే నటన మరొక ఎత్తు. ‘బజరంగీ భాయిజాన్’ మరియు ‘సుల్తాన్’ వంటి చిత్రాల్లో ఆయన నటన ఇందుకు నిదర్శనం. వెండి తెరపై సల్మాన్ ఖాన్ చేసే లార్జర్ ద్యాన్ లైఫ్ పాత్రలు భారతీయ చలనచిత్ర రంగంలో ఆయనను ఒక తిరుగులేని ‘సుల్తాన్’గా నిలబెట్టింది. ఆయనే ఒక బ్రాండ్, ఆయనే ఒక ట్రెండ్ సెట్టర్. ఇక ఈ సినిమాను భారీ సినిమాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అగ్ర కథానాయిక నయనతార సల్మాన్ సరసన నటిస్తున్నారు. భారీ స్థాయిలో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఎవరు కనిపించనున్నారనే దానిపై ఒక వార్త వినిపిస్తోంది. సల్మాన్ తో తలపడే విలన్ పాత్రలో ఇద్దరు కీలక నటుల పేర్లు వినిపిస్తున్నాయి. మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫజిల్ పేరు అలాగే మరొకరు ఇటీవలే ధురంధర్ లో నటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వైవిధ్య పాత్రలతో అలరించే నటుడు అరవింద్ స్వామి ఒక కీలక పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబయిలో దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోందని నయనతార కూడా ఈ తాజా షెడ్యూల్లో పాల్గొన్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ రేంజ్ కు తగినట్లుగా వంశీ పైడిపల్లి తనదైన టేకింగ్ తో ఈ సినిమా భారీ స్థాయిలో రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.