ప్రపంచానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తానే పెద్దన్నను అంటూ వచ్చే అమెరికా, ఆ కష్టం వెనుక తన స్వార్థం ఎంత ఉందో మాత్రం ఎప్పుడూ చెప్పదు. ఇరాన్ తో వైరంతో ప్రపంచానికి ఒక రకమైన పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు మళ్లీ తనే శాంతి దూత అవతారం ఎత్తింది. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ పేరుతో భారత్ వంటి దేశాల మీద లేని ప్రేమను ఒలకబోస్తోంది. అసలు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాటల వెనుక ఉన్న మర్మమేంటి? ట్రంప్ మార్క్ రాజకీయం ఎలా ఉండబోతోంది?
“ప్రాజెక్ట్ ఫ్రీడమ్” వెనుక..
ఇంటర్నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై అమెరికా పనులు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తడం, లేకపోతే పక్కకు తోసేయడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాటలు వింటే ఆ దేశ స్వార్థం మరోసారి బయటపడింది. ఇరాన్‌తో యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది వారే. ఇప్పుడు మళ్లీ వారే ప్రొటెక్టర్స్ లాగా రావడం వింతగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ సప్లై చైన్స్ ను తామే కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. భారతదేశంలోని కోట్లాది మంది ఎల్పీజీ అవసరాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజానికి ఇదంతా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను కాపాడటం దీని మెయిన్ టార్గెట్ అట. కానీ ప్రపంచానికి ఈ గతి పట్టించింది ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న. అడ్డుకట్ట వేసి తరువాత దారి చూపినట్లు ఉంది అమెరికా వ్యవహారం. పేద దేశాలు తమను వేడుకున్నాయని అందుకే రంగంలోకి దిగామని వారు చెప్పుకుంటున్నారు. భారత్ వంటి దేశాలకు ఇంధన కొరత రాకూడదనే ఈ నిర్ణయమట. ఫెర్టిలైజర్స్, ఫుడ్ సప్లై కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమని బెస్సెంట్ అన్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ఇందులో పైకి చెప్పని కారణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తన ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని పావుగా వాడుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. అక్కడ ఉద్రిక్తతలు పెరిగి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు పరిస్థితులు చేయి దాటుతున్నాయని గ్రహించి మానవతావాదిగా కొత్త అంశాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంటగది అవసరాలను ప్రస్తావించడం ఒక స్ట్రాటజీ. ఇలా చేయడం ద్వారా భారత్ మద్దతును కూడగట్టాలని అమెరికా చూస్తోందని అర్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకోవడమే వీరి ప్రణాళికగా కనిపిస్తోంది. యుద్ధం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాదని వారికీ తెలుసు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
చైనా, ఇరాన్ బంధంపై
చైనా, ఇరాన్ బంధంపై అమెరికా చేస్తున్న విమర్శలు కూడా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇరాన్ నుంచి 90 శాతం చమురును చైనా కొనుగోలు చేస్తోందని బెస్సెంట్ ఆరోపించారు. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశమని అమెరికా ముద్ర వేసింది. చైనా ఆర్థికంగా అండగా ఉండటం వల్లే ఇరాన్ పెట్రేగిపోతుందని వారి వాదన. వచ్చే వారం ట్రంప్, జిన్‌పింగ్‌ల భేటీపై అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో చైనా తన పద్ధతి మార్చుకోవాలని అమెరికా కోరుతోంది. అంతర్జాతీయ శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని డిమాండ్ చేస్తోంది. ఇది కేవలం దౌత్యపరమైన ఒత్తిడి మాత్రమే అని జియో పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు.
ఇరాన్ పై ఘాటైన విమర్శలు
ఇరాన్ సైనిక సామర్థ్యంపై అమెరికా ఘాటైన వ్యాఖ్యలే చేస్తోంది. ఇరాన్ తన పోరాట పటిమను పూర్తిగా కోల్పోయిందని బెస్సెంట్ ఎద్దేవా చేశారు. ఆ దేశ నాయకత్వం ప్రాణ భయంతో బంకర్లలో దాక్కుందని విమర్శలు గుప్పించారు. అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడే సత్తా వారికి లేదని ఇరాన్ నౌకాదళం ఒకప్పుడు బలంగా ఉన్నా ఇప్పుడు లేదని అంతర్జాతీయ నౌకాయానాన్ని అడ్డుకోవడమే వారి పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సైనికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇరాన్ ఎకానమీలో లేదన్నారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. ఆ దేశం చేస్తున్న విన్యాసాలన్నీ కేవలం ఆత్మరక్షణ కోసమేనని వారు భావిస్తున్నారు. ఇరాన్ తన ఉనికి కోసం ప్రయత్నిస్తోందట. కానీ అమెరికా మాత్రం ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయాలని చూస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ద్వారా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తోంది. చమురు ధరలను నియంత్రణలోకి తేవడం తమ బాధ్యతని చెప్పుకుంటోంది. ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా సాగేలా చూస్తామంటున్నారు. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో అమెరికా తన గ్రిప్ ఉంచుకోవాలని భావిస్తోంది.
ఇరాన్ ను ఒంటరిని చేయడమే వ్యూహమా?
ఇరాన్ ను ఒంటరిని చేయడమే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న వారిని శత్రువులుగా మార్చడంలో అమెరికాది ప్రత్యేక శైలి. హర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకల మోహరింపు వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ప్రపంచ దేశాలకు తాము లేకపోతే దిక్కు లేదని నిరూపించాలని చూస్తున్నారు. భారతదేశం వంటి పెద్ద మార్కెట్లను తనవైపు తిప్పుకోవడం అమెరికాకు ఇప్పుడు చాలా అవసరం. అందుకే మన దేశంలోని సామాన్యుల వంట గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు. ఇక చైనా-అమెరికా మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇరాన్ కు చైనా ఆర్థిక మద్దతు ఇస్తుండటం అమెరికాకు ఇబ్బందికరంగా మారింది. జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ జరిగితే ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది. చైనా తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఇరాన్ ను వాడుకుంటోంది. అమెరికా తన సైనిక శక్తితో ఇరాన్‌ను అణచివేయాలని చూస్తోంది. మధ్యలో చిక్కుకున్న పేద దేశాలు ఇంధన ధరల భారంతో ఇబ్బందిపడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఇస్తుందా లేక మరిన్ని చిక్కులు తెస్తుందా? రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు దీనికి సమాధానం చెబుతాయి.
హర్ముజ్ జలసంధిలో తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడమే అసలు ఎజెండా అని అర్ధంమవుతోంది. ఏదేమైనా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశం కూడా ఉచితంగా సాయం చేయదు. అమెరికా చెబుతున్న ఈ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ వెనుక ఇరాన్ ను ఒంటరిని చేయడం, చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనే కీలక స్ట్రాటజీలు ఉన్నాయి. అమెరికా వేస్తున్న ఈ ఎత్తుగడలు ఏ విధమైన ప్రభావాలు చూపుతాయో చూడాలి. ఏదేమైనా అవకాశవాదానికి కేరాఫ్ అడ్రస్.. అమెరికా అనే వాదన వినిపిస్తోంది.