ఆధ్యాత్మికత మరియు ఆధునికత కలగలిసిన నగరం విజయవాడ. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ నగర ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి విశిష్టత కలిగిన ఒక అంశాన్ని ఇప్పుడు చూద్దాం. అధ్యాత్మిక నగరంలో విరాజిల్లుతున్న విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకత కలిగిన ఆలయాలలో ఒకటి శ్రీ దుర్గాభవాని ఆలయం. ఈ ఆలయం మొగల్రాజపురం ప్రాంతంలో కొండమీద ఉన్న స్వయంభు ఆలయం. ఈ ఆలయం గత చరిత్రలోకి వెళితే ఇంద్రకీలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలయటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాథలు ఉన్నాయి.
దుర్గా అమ్మవారు దక్షిణాదినుంచి కదిలి ఉత్తరదిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన వెలిసింది. అదే రోజులలో ఒక గొల్లవాడు మేకలు, గొర్రెలు తోలుకుని ఆ కొండపై ప్రాంతానికి వెళ్ళేవాడు. అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతాలలో ఎక్కడో గజ్జెల శబ్దాలు వినిపించడంతో ఈ శబ్దం ఎక్కడనుండి వినపిస్తుందని కొండ పైభాగంలోని పరిసర ప్రాంతాలలో వెతకసాగాడు. అప్పుడు ఓ సాధారణ స్త్రీ రూపంలో ఆమె గొల్లవాడికి కనపడి పిలిచి నీకు మూడు బస్తాలు బంగారం ఇస్తూన్నాను పట్టుకుని వెళ్ళిపో ఎటువంటి పరిస్థితిలో వెనక్కి తొంగిచూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది. అలాగేనని బంగారం తీసుకున్న గొల్లవాడు వెళుతూ మూడవవంపు దగ్గరికి వచ్చి తొంగిచూడగా వెంటనే అక్కడ మాయమైపోయిందని అంటుంటారు. ఆనాటి నుంచి ఈ కొండను ధనకొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే దాదాపు రెండువందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని స్థానికులు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొండలోనే వెలసిన అమ్మవారి రూపం శ్రీ చక్రరూపంలో వుంటుంది. ఈ శ్రీ చక్రంలోనే చక్కగా కళ్ళు, పాదాలు సైతం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంటుందని చెప్తారు. ఎటువంటి దారి డొంకలేని ఈ ప్రదేశంలోకి వెళ్ళాలంటే చెట్టు, చేమలు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కవలసిందే.అయితే ఇక్కడ దసరా పండుగ సమయంలో ఆ చుట్టుపక్కలవారు జాతర నిర్వహిస్తూ ఉంటూరు. ఆ సమయంలో మాత్రమే ఆ కొండ ఎక్కి పూజలు నిర్వహిస్తారు, నైవేద్యాలు వంటివి పెట్టి వచ్చేవారు. ఆ తరువాత తిరిగి మరలా సంవత్సరం వచ్చే దసరా పండుగకే తిరిగి కొండ ఎక్కేవారు. ఈ ప్రాంతంలో ఇప్పటికి ఆలయ పరిసర ప్రాంతాలలో గజ్జెల శబ్దం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులు ఇలవేల్పుగా కొలుస్తూ ఆది, శుక్రవారంలో అధికంగా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యంగా సమర్పించుకుంటారు. కొలిచినవారికి కొంగుబంగారమై విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిచేయాలనే ఉద్దేశ్యంతో స్థానికులు కొందరు కంకణం కట్టుకున్నారు. 1992లో దాదాపు ఏడు అడుగులుగల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు.