‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సద్గురు

Spread the love
The current image has no alternative text. The file name is: 3-1.jpg

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు కెనడా ఇండియా ఫౌండేషన్ (CIF) ప్రతిష్టాత్మకమైన 2025 గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది. కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుతో సత్కరించారు. కెనడా – ఇండియా ఫౌండేషన్(సీఐఎఫ్‌) తరఫున నాయకత్వం, దార్శనికతతో మానవాళి అభ్యున్నతికి కృషిచేస్తున్న భారత సంతతికి చెందిన అత్యుత్తమ నాయకులను గుర్తించి ఏటా సీఐఎఫ్‌ గ్లోబల్‌ ఇండియన్ అవార్డును ఏటా ప్రదానం చేస్తున్నారు. 2025 ఏడాదికిగాను పురస్కారాన్ని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు ప్రకటించారు. మే 22న టొరొంటోలో జరిగిన కార్యక్రమంలో సీఐఎఫ్‌ అధ్యక్షుడు రితేష్‌ మాలిన్, ఐసీఐసీఐ బ్యాంకు-కెనడా ఛైర్మన్ హిమధర్ మడిభట్ల, కొఠారి గ్రూప్‌ ఛైర్మన్ నార్టన్ కొఠారి అవార్డును సద్గురుకు అందజేశారు. ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో సద్గురు చేసిన కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా 50 వేల కెనడియన్ డాలర్ల నగదు బహుమతిని సద్గురు కావేరీ పిలుపు కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో కావేరీ నది పునరుజ్జీవనానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది.

సీఐఎఫ్ అధ్యక్షుడు రితేష్ మాలిక్ మాట్లాడుతూ.. “నేల క్షీణత, ఆహార నాణ్యత, వాతావరణ మార్పు వంటి సమస్యలకు సద్గురు ఆచరణాత్మక పరిష్కారాలు అందిస్తున్నారు. యోగా, ధ్యానంపై ఆయన దృష్టి కెనడా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా ఉంది” అని అన్నారు.

భారతదేశం, కెనడా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసే పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ కెనడా ఇండియా ఫౌండేషన్. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ కృషి చేసిన భారతీయ వారసత్వం ఉన్న వ్యక్తులను గుర్తించి గ్లోబల్ ఇండియన్ అవార్డును ప్రదానం చేస్తుంది.సద్గురు కాన్షియస్ ప్లానెట్ కార్యక్రమంలో భాగంగా నేలను కాపాడుకుందాం, నదుల కోసం ర్యాలీ, కావేరీ పిలుపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. కావేరీ పిలుపు ద్వారా 2.42 బిలియన్ చెట్లను నాటేందుకు రైతులకు మద్దతు ఇస్తున్నారు. దీంతో సద్గురు ప్రభావవంతమైన గ్లోబల్ ఇండియన్ల జాబితాలో చేరారు.