వ్యక్తిగత విభాగంలో కూడా గోల్డ్…భారత్ కు మరో మెడల్..చరిత్ర సృష్టించిన నీరూ

Spread the love

ఆసియా క్రీడలు 2026లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ లేని లోటును తీరుస్తూ మహిళల ట్రాప్ షూటింగ్ లో నీరూ దండా మొదటి స్థానంలో నిలిచి భారత్ కు మెడల్ ను అందించారు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ కు 4వ గోల్డ్ మెడల్ లభించినట్లయింది. ఇప్పటికే మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్ లో నీరూ సిల్వర్ మెడల్ తో సత్తా చాటిన విషయం విదితమే. ఆ టీమ్ లో ఆమెతో పాటు ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ ఉన్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె, భారతీయ ఆర్మీలో  సేవలు అందిస్తూనే షూటింగ్‌లో దేశానికి ఎన్నో చిరస్మరణీయ  విజయాలను అందించారు. ముఖ్యంగా మహిళల ట్రాప్ షూటింగ్ విభాగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ భారతదేశం గర్వించదగ్గ షూటర్ గా నిలిచారు. 

ఆసియా గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో వ్యక్తిగత గోల్డ్  సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఆమె ఘనత సాధించారు. 2026 లో ఇటలీలోని లోనాటోలో జరిగిన ISSF షాట్‌గన్ ప్రపంచ కప్‌లో మహిళల ట్రాప్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా అలాగే ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ట్రాప్ వ్యక్తిగత మరియు జట్టు విభాగాల్లో ఏకంగా రెండు మెడల్స్ సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 68వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ (NSCC) తో పాటు నేషనల్ గేమ్స్‌లో కూడా మహిళల ట్రాప్ ఈవెంట్‌లో బంగారు పతకాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుని భారత క్రీడాభిమానులు ప్రశంసలు కురిపించారు. 

ఇక ఈ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఫైనల్ లో భారత అమ్మాయిలు అద్భుత విజయంతో తొలి గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్ జీత్ జోడీ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇక కబడ్డీలో మహిళల, పురుషుల టీమ్ లు  అదరగొట్టేశాయి. అయితే ఇవన్నీ టీమ్ ఈవెంట్స్. కానీ నీరూ వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో మెరవడం చెప్పుకోదగిన అంశం. ఈ విజయంతో మెడల్స్ ట్యాలీలో భారత్ ఒక స్థానం ముందుకు వెళ్లింది. 5 బంగారు, 21 రజత, 22 కాంస్య పతకాలతో మొత్తం 48 మెడల్స్ తో కొనసాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *