ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 2026 నూతన సంవత్సరం వేళ అత్యంత హింసాత్మకంగా మారింది.ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు, 42.5 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం, ఇరాన్ రియాల్ విలువ పతనం కావడంతో ఆగ్రహించిన ప్రజలు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చారు.వారం రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి.టెహ్రాన్ యూనివర్సిటీ విద్యార్థులు “సర్వాధికారికి మరణం” అంటూ నినాదాలు చేస్తూ, ప్రవాసంలో ఉన్న మాజీ పాలకుడి కుమారుడు రెజా పహ్లావీకి మద్దతు ప్రకటించడం గమనార్హం. కుహదాష్త్ వంటి నగరాల్లో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన యుద్ధం లాంటి పరిస్థితుల్లో బాసిజ్ పారామిలిటరీ దళానికి చెందిన వ్యక్తి కూడా మరణించారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, అణచివేత చర్యలకు దిగుతోంది. మరోవైపు నిరసనకారులు తగ్గకపోవడంతో, ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.